
ముప్పా సురేష్ అరెస్టు
ఒంగోలు టౌన్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు ముప్పా సురేష్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు. గత ఏప్రిల్ 22వ తేదీ వీరయ్య చౌదరి హత్య జరిగినప్పటి నుంచి ముప్పా సురేష్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. హైకోర్టుకు వెళ్లిన ఆయనకు చుక్కెదురైంది. సుప్రీం కోర్టుకు వెళ్లినా బెయిల్ లభించలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఆయన అరెస్టుతో వీరయ్య చౌదరి కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేసినట్లయింది.
● అడ్డుకున్న భూ యజమానులు
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): కృష్ణపట్నం నుంచి హైదరాబాదు వెళ్లే బీపీసీఎల్ పెట్రోల్ పైపులైన్ నిర్మాణ పనులను ప్రైవేట్ స్థలాలలో చేపట్టడంతో భూ యజమానులు అడ్డుకున్నారు. సంతనూతలపాడు మండలం రెడ్డిపాలెం సర్వే నంబరు 437లో సోమవారం పనులను ప్రారంభించగా, సదరు భూ యజమానులు అడ్డుకున్నారు. భూ యజమానులైన చలువాది బదరీ నారాయణ, పబ్బిశెట్టి శ్రీనివాసరావుకు – బీపీసీఎల్ పెట్రోల్ పైపులైన్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, స్థానిక తహసీల్దార్ నారాయణరెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లి నిర్మాణ పనులను నిలిపివేశారు. భూమికి సంబంధించిన పత్రాలతో భూ యజమానులు, బీపీసీఎల్ పెట్రోల్ పైపులైన్ అధికారులు మంగళవారం ఒంగోలు ఆర్డీఓ కార్యాలయానికి రావాలని ఆర్డీఓ ఆదేశించారు.
ఒంగోలు: చెక్ బౌన్స్ కేసులో నిందితునికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ ఎకై ్సజ్ మేజి
స్ట్రేట్ ఎస్.కోమలవల్లి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసుశాఖలో అదనపు ఎస్పీగా పనిచేసి రిటైరైన ఒంగోలు నివాసి తాడి జయప్రసాద్ వద్ద కుటుంబ ఖర్చుల నిమిత్తం పోలీసుశాఖలోనే హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసి రిటైరై, అద్దంకి మండలం వేలమూరిపాడులో నివాసం ఉంటున్న జ్యోతి కోటేశ్వరరావు 2015 సెప్టెంబర్ 24న రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. అందుకుగానూ ప్రామిసరీ నోటు అందజేశారు. అనంతరం వడ్డీ నిమిత్తం బ్యాంకు ద్వారా రెండు దఫాలు కొంత మొత్తం చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లించమని ఒత్తిడి రావడంతో పార్ట్ పేమెంట్ కింద రూ.12 లక్షలకు చెక్కు ఇచ్చారు. ఈ చెక్కును తాడి జయప్రసాద్ బ్యాంకులో జమచేయగా, అది బౌన్స్ అయింది. దీంతో ఆయన కోర్టులో కేసు వేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి నేరం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితుడు జ్యోతి కోటేశ్వరరావుకు ఏడాదిన్నర జైలుశిక్ష, ఫిర్యాదికి నష్టపరిహారం కింద రూ.12 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అదే విధంగా రూ.10 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలలపాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.