
పోలీసు స్పందనకు 64 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం మీ కోసంలో 64 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ సమస్యలతో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు నేరుగా ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ప్రజా సమస్యలపై స్పందించిన ఎస్పీ.. నేరుగా ఆయా పోలీసుస్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. మీ కోసంలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరగాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ ప్రజలకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతోనే ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎస్సీ, ఎస్టీ సెల్ సీఐ దుర్గాప్రసాద్, సీసీఎస్ సీఐ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు.
మాకు న్యాయం చేయండి..
పుల్లలచెరువు: మాకు న్యాయం చేయండి అంటూ వినుకొండకు చెందిన గజ్వల్లి విజయభారతి, కుమారుడు మణికంఠ గుప్త సోమవారం ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో ఎస్పీ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. తన భర్త గజ్వల్లి నాగేశ్వరరావుకు సోదరులైన పుల్లలచెరువుకు చెందిన గజ్వల్లి భాస్కరరావు, గజ్వలి శ్రీనివాసరావు తన భర్తకు రావాల్సిన ఆస్తులు అడగడానికి తేదీ 30–07–2025న పుల్లలచెరువు వెళ్లిన తమను తీవ్రంగా అవమానించి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి షాపు వద్ద మాట్లాడుతున్న తమపై భాస్కరరావు, శ్రీనివాసరావు పుల్లలచెరువు పోలీసులకు ఫిర్యాదు చేసి తమ కుమారుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారన్నారు. స్టేషన్‌లో పోలీసులతో కొట్టించి దుర్భాషలాడారన్నారు. అదే రోజు స్టేషన్‌లో పోలీసుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ నాటికి తమను పిలిచి పరిష్కరిస్తానని వారిద్దరూ చెప్పి ఉన్నారన్నారు. కానీ, నేటికీ ఎటువంటి సమాచారం లేదన్నారు. తనకు, తన కుమారుడికి తన మరుదులు, పోలీసులతో ప్రాణహాని ఉందని, తమకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.