
నిషేధిత కత్తి
అధికారుల నిర్లక్ష్యం..రైతులకు శాపం చెరుకూరు రెవెన్యూ పరిధిలో పట్టా భూములు నిషేధిత భూములుగా నమోదు ఆరు గ్రామాల్లో సుమారుగా 1500 సర్వే నంబర్లలోని 4 వేల ఎకరాలు నమోదు చేసిన అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు విన్నవించినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు, మంత్రి స్వామి
పట్టా భూములపై
తిమ్మపాలెంలో నిషేధిత భూమిగా నమోదైన పట్టా భూమి
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో సుమారు ఆరు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తమ వ్యవసాయ పట్టా భూములను రెవెన్యూ రికార్డులు, ఆన్‌లైన్‌లో నిషేధిత, ప్రభుత్వ భూములుగా నమోదు చేయడంతో వారు అవస్థలు పడుతున్నారు. అధికారులు చేసిన తప్పిదాన్ని మరోసారి పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని కొన్ని నెలలుగా ఆయా గ్రామాల రైతులు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
పొన్నలూరు: రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో రైతుల సొంత భూములపై ఉన్న హక్కులను ఇబ్బందుల్లోకి నెట్టారు. పొన్నలూరు మండలం చెరుకూరు రెవెన్యూ పరిధిలో తిమ్మపాలెం, చెరుకూరు, ముండ్లమూరివారిపాలెం, రామన్నపాలెం, శివన్నపాలెం, వెంకుపాలెం గ్రామాలు ఉన్నాయి. చెరుకూరు రెవెన్యూ పరిధిలోని 15వ సర్వే నంబర్ నుంచి 1398 సర్వే నంబర్ వరకు సుమారు 4 వేల ఎకరాలకు పైగా రైతుల వ్యవసాయ పట్టా భూములు ఉన్నాయి. భూములన్నీ రైతులకు వారసత్వంగాను, కొనుగోలు ద్వారా పక్కాగా పట్టా భూములుగా ఉన్నాయి. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నిషేధిత, ప్రభుత్వ భూములను గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో ఈ పట్టా భూములను స్థానిక రెవెన్యూ అధికారులను క్షేత్ర స్థాయిలో విచారించి నిషేధిత భూములు ఉంటే గుర్తించాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ అధికారులు నిషేధిత, ప్రభుత్వ భూములను గుర్తించే క్రమంలో పొరపాటున లేదా కావాలనే చేశారో.. ఏమైందో ఏమోగానీ ఈ వ్యవసాయ భూముల్లోని సుమారు కొన్ని వేల ఎకరాలను ఆరు గ్రామాల రైతులకు తెలియకుండా రెవెన్యూ రికార్డులు, ఆన్‌లైన్‌లో నిషేధిత, ప్రభుత్వ భూములుగా నమోదు చేశారు. దీంతో గత టీడీపీ ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం వలన రైతులు నేడు ఇబ్బందులు పడుతున్నారు.
అవస్థలు పడుతున్న రైతులు:
ఆరు గ్రామాలకు చెందిన రైతుల వ్యవసాయ పట్టా భూములను నిషేధిత, ప్రభుత్వ భూములుగా నమోదు చేయడం వలన 2017 నుంచి ఇప్పటి వరకు రైతులు పలు విషయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకులు నుంచి రుణాలు పొందాలంటే ఆన్‌లైన్‌లో నిషేధిత భూములుగా ఉండటంతో వ్యక్తిగత రుణాలు తీసుకోలేకపోతున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే వ్యవసాయ రాయితీలు, పథకాలు సక్రమంగా పొందలేకపోతున్నారు. ప్రధానంగా రైతులు వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమ పట్టా భూములను అమ్ముకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా వీలు పడక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
విన్నవించినా పట్టించుకోవడం లేదు
భూముల సమస్యపై కొన్ని నెలలుగా జిల్లా నుంచి, స్థానిక అధికారుల దృష్టికి ఆయా గ్రామాల రైతులు అర్జీల రూపంలో సమస్యను తెలియజేస్తున్నా..ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే స్థానిక మంత్రి స్వామికి విన్నవించినా ఫలితం శూన్యమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

నిషేధిత కత్తి