
ఘనంగా నాగభైరవ పురస్కార ప్రదానోత్సవం
ఒంగోలు మెట్రో: ప్రముఖ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు పేర ఏటా ఇస్తున్న నాగభైరవ సాహిత్య పీఠం పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఆదివారం ఒంగోలులోని రెడ్‌క్రాస్ భవనంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సినీ నటుడు రఘుబాబు మాట్లాడుతూ నాగభైరవ కోటేశ్వరరావును తాను చిన్నప్పుడు తాత అని పిలిచేవాడినంటూ ఆయనతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజానాట్యమండలి నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు మాట్లాడుతూ ఏటా క్రమం తప్పకుండా నాగభైరవ కోటేశ్వరరావు పేరిట రచయితలకు పురస్కారాలు ప్రదానం చేయడం సముచితంగా ఉందని అన్నారు. కళామిత్రమండలి అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు మాట్లాడుతూ నాగభైరవ కోటేశ్వరరావు కదిలించే కవిత్వాన్ని కళ్లముందుంచి, కవిత్వమే ఊపిరిగా బతికారని అన్నారు. పద్యాన్ని, గద్యాన్ని సమపాళ్లలో రంగరించి రచనలు చేసిన గొప్ప సాహితీవేత్త నాగభైరవ అని కొనియాడారు. సాహిత్యపీఠం చేస్తున్న సేవను వీరవల్లి సుబ్బారావు అభినందించారు. కుర్రా ప్రసాద్ బాబు నాగభైరవతో తన పరిచయాన్ని వివరించారు. అనువాద ప్రక్రియలో పురస్కారాలు పొందిన రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (నెత్తురు నది), కోనేరు కల్పన (దర్పణం)లకు వరుసగా రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున నగదు బహుమతులను నిర్వాహకులు అందించారు. కేకేఎల్ స్వామికి నాగభైరవ కళా పురస్కారం రూ.10 వేలు, నాగభైరవ ఆత్మీయ పురస్కారం పొందిన గిరిబాబు తరఫున ఆయన కుమారుడు రఘుబాబుకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కవులు, రచయితలు డాక్టర్ బీరం సుందరరావు, చుండి బేబీ సుజాత, కె.బాలకోటయ్య, వి.ఝూన్సీదుర్గ, బీరం అరుణ, సింహాద్రి జ్యోతిర్మయి, కేఎస్వీ ప్రసాద్, పోతినేని వెంకటేశ్వర్లు, బెజవాడ రామారావు, డాక్టర్ నాగభైరవ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.