
ప్రభుత్వ విద్యాలయాల్లో రాజకీయ వేదికలా.
విద్యాశాఖా మంత్రీ మీకు కనిపిస్తుందా...లేదా? లోకేష్‌ను ప్రశ్నించిన మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: మీరు ఇచ్చిన జీఓలను మీరే తుంగలో తొక్కి విద్యాలయాలను రాజకీయాలకు వేదికలుగా మారుస్తున్నారని, జీఓలు, ఉత్తర్వులు ఆచరించటానికి కాదు...కేవలం ప్రతిపక్షాలను అణగ తొక్కటానికేనా అని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కొండపి వ్యవసాయ మార్కెటింగ్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించటంపై మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పనితీరుపై ఘాటుగా స్పందించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసే జీఓలు, ఉత్తర్వులు, చట్టాలన్నీ ప్రతిపక్షాలకే తప్ప మీరు ఆచరించటానికి కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో ఏఎంసీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం మూడు రోజులుగా విద్యార్థులు ఆడుకోవటానికి వీలు లేకుండా ఏర్పాట్లు చేస్తూ మైదానంలో గుంటలు తవ్వి ధ్వంసం చేశారని అన్నారు. కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు హాజరవటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సాక్షాత్తు నంబరు 2 గా చెప్పుకునే లోకేష్‌కు చెందిన విద్యాశాఖలోనే ఈ విధంగా ఉల్లంఘనలు జరగటం దారుణమన్నారు. నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తే రాజకీయాల కోసం ఆ పాఠశాలలను వాడుకుంటూ లక్షలాది రూపాయలతో బాగు చేసిన మైదానాలు విద్యార్థులకు పనిరాకుండా చేయటమేనా ముందడుగు అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాల క్రీడామైదానాల చుట్టూ కాంపౌండ్‌వాల్ కట్టి భద్రపరిస్తే కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం వాటిని రాజకీయ వేదికలుగా మారుస్తున్నారని ఆరోపించారు. చివరికి కార్యక్రమం సందర్భంగా పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోనే వంటలు వండటంతో పాటు మిగిలిన అన్నం, వంటకాలను ఆ పాఠశాల ఆవరణలోనే జేసీబీతో గుంటలు తీసి పోశారని ఆరోపించారు. ప్రస్తుతం క్రీడా మైదానాలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారని, ఇక ముందు పాఠశాల ఫర్నిచర్‌ను కూడా రాజకీయ సమావేశాలకు వాడినా ఆశ్చర్యం లేదన్నారు. ఇదేనా పాఠశాలలను అభివృద్ధి చేయటం అని చినబాబును ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీ కూన శశిధర్, విద్యాశాఖ కమిషనర్ రామరాజు, కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఈఓ కిరణ్‌కుమార్‌కు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు వివరించారు.