
కెమెరా ట్రాప్‌లో చిరుత
పెద్దదోర్నాల: మండల పరిధిలోని చిన్నారుట్ల గిరిజన గూడెంలో మూడేళ్ల బాలిక కుడుముల అంజమ్మపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు కెమెరా కంటికి చిక్కింది. గత బుధవారం తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిపై చిరుతపులి దాడి చేసి గాయపర్చిన సంఘటన పాఠకులకు విదితమే. ఈ సంఘటనతో అటవీశాఖ ఉన్నతాధికారులు చిన్నారుట్ల గూడెంలో ఐదుగురు ప్రొటక్షన్ వాచర్లను ఏర్పాటు చేయటంలో పాటు గూడెం చుట్టూ 15 ట్రాప్డ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గూడెం చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాలో చిరుత సంచారం నిక్షిప్తమైంది. చిన్నారుట్ల గూడెం పరిసరాల్లో సంచరిస్తున్న చిరుత గూడెంలోని రెండు లేగ దూడలపై కూడా దాడి చేసి వాటిని చంపినట్లు గిరిజనులు పేర్కొంటున్నారు. ఆయా సంఘటనలతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఆదివారం చిన్నారుట్ల గిరిజన గూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దదోర్నాల ఫారెస్టు రేంజి అధికారి హరి గూడెంవాసులకు పలు సూచనలు చేశారు. రాత్రి వేళల్లో చెంచు గిరిజనులు బయట తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
గిరిజనులు అప్రమత్తంగా ఉండాలి..
నల్లమల అభయారణ్యంలో పులుల సంతతి పెరిగేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా పులులకు ఆహారంగా ఉపయోగపడే జింకలు, దుప్పులు, అడవి పందుల పెరుగుదలకు మూడు నెలల పాటు అభయారణ్యంలో ప్రవేశించటాన్ని అధికారులు నిషేధించారు. జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పులుల మేటింగ్‌కు అనుకూలమైన వాతావరణం. దట్టమైన అభయారణ్యంలోని నిషిద్ధ ప్రాంతాల్లోకి పర్యాటకులు, ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైనా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఈ సమయం పూర్తిగా వర్షాకాలం కాబట్టి కురిసిన వర్షాలతో అడవి అంతా పచ్చబడి దట్టమైన చెట్లు, పొదలతో నిండి ఉంటుంది. ఈ కాలంలోనే పెద్దపులులు తాము జత కట్టిన పులితో ప్రశాంతతో సంచరిస్తుంటాయి. దీని వల్ల అభయారణ్యంలో నివసించే చెంచు గిరిజనులు ఈ సమయంలోనే కాస్తంత అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
రాత్రివేళ జాగ్రత్తగా ఉండండి..
చిన్నారుట్ల గూడెం వాసులు అప్రమత్తంగా ఉండాలని పెద్దదోర్నాల ఫారెస్టు రేంజి అధికారి హరి పేర్కొంటున్నారు. గత బుధవారం గూడెంలోని బాలికపై దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్న చిరుత గూడెం చుట్టే తిరుగుతున్నట్లు కెమెరా ట్రాపుల్లో నిక్షిప్తమైంది. ఈ నేపథ్యంలో గూడేనికి చెందిన గిరిజనులు రాత్రి వేళల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. చిరుత సంచారానికి సంబంధించి సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఆయన తెలిపారు. రాత్రి వేళల్లో గూడెం చుట్టూ తమ సిబ్బంది నిరంతర పెట్రోలింగ్ ఉంటుందని, గూడెం వాసులు ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు.

కెమెరా ట్రాప్‌లో చిరుత