రోడ్డెక్కని ఫోర్‌ లైన్‌ పనులు.! | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కని ఫోర్‌ లైన్‌ పనులు.!

Aug 18 2025 5:47 AM | Updated on Aug 18 2025 5:47 AM

రోడ్డ

రోడ్డెక్కని ఫోర్‌ లైన్‌ పనులు.!

ప్రతిపాదనలకే పరిమితమైన ఒంగోలు – బేస్తవారిపేట ఫోర్‌ లైన్‌ రోడ్డు నిర్మాణం 113 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సి ఉండగా, ఏడాది నుంచి అతీగతీ లేని వైనం ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు చీమకుర్తిలో ఎటువైపు నిర్మిస్తారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు

చీమకుర్తి: అదిగో ఫోర్‌లైన్‌.. ఇవిగో నిధులు అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒంగోలు–బేస్తవారిపేట ఫోర్‌ లైన్‌ రోడ్డు నిర్మాణం గురించి ఊదరగొడుతున్నారు. కానీ, ప్రతిపాదనల దశ దాటి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ప్రభుత్వం తీరుపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకులు, అధికారుల అధ్వానపు పనితీరు కారణంగానే ఫోర్‌ లైన్‌ పనులు రోడ్డెక్కలేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు సమీపంలోని ఎస్‌ఎస్‌ఎస్‌ కాలేజీ వద్ద 8వ కిలోమీటరు వరకు ఒంగోలు–కర్నూలు రోడ్డు ఫోర్‌ లైన్‌ నిర్మాణం జరిగి ఉంది. ఒంగోలు నుంచి 9వ కిలోమీటరు నుంచి బేస్తవారిపేట వరకు సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి, కనిగిరి, మార్కాపురం, కంభం, బేస్తవారిపేట ఆర్‌అండ్‌బీ రోడ్డు మీదుగా దాదాపు 113 కిలోమీటర్ల మేర ఫోర్‌ లైన్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు మూడు దశలలో సర్వేలు నిర్వహించి ఏది ఉత్తమమో పరిశీలించనున్నారు. ప్రభుత్వ భూమి, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సిన భూమి ఎంతెంత ఉంటుందో లెక్కలు కట్టనున్నారు. ఎన్ని వంతెనలు, ఎన్నెన్ని బైపాస్‌లు, ఎన్ని టోల్‌ ప్లాజాలు పెడితే పెట్టిన ఖర్చు ఎంత కాలంలో వసూలు చేసుకునే వీలుంటుందనే పలు అంశాలపై సర్వేలు పూర్తయిన తర్వాత ఫోర్‌లైన్‌కు టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి. ప్రతిపాదనలు, సర్వే పనుల్లోనే తీవ్ర జాప్యం నెలకొనడంతో ఇక రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యేది ఎప్పుడో.. పూర్తయ్యేది ఎప్పుడోనని ప్రజలు నిట్టూరుస్తున్నారు. ప్రభుత్వ నత్తనడక తీరును విమర్శిస్తున్నారు.

చీమకుర్తి బైపాస్‌ వైపే ఫోర్‌ లైన్‌ ఎక్స్‌టెన్షన్‌కు ప్రతిపాదనలు...

చీమకుర్తి పట్టణానికి ఊరు వెలుపుల సాగర్‌ కాలువ కట్ట మీదుగా ఇప్పటికే డబుల్‌ లైన్‌ బైపాస్‌ ఉంది. దాన్నే ఫోర్‌లైన్‌గా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. చీమకుర్తి బైపాస్‌ను సాగర్‌కాలువకు ఉత్తరం వైపున్న కాలువ కట్టపై నిర్మించి ఉన్నారు. దానికి అదనంగా మరో డబుల్‌ లైన్‌ వేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఫోర్‌లైన్‌ నిర్మాణానికి డివైడర్‌కు ఇరువైపులా 7 మీటర్ల చొప్పున రెండువైపులా కలిసి 14 మీటర్లు కావాల్సి ఉంది. డివైడర్‌కు మరో రెండు మీటర్లు, ఇరువైపులా రోడ్డు మార్జిన్‌లకు మరో రెండు మీటర్ల చొప్పున 4 మీటర్లు కావాల్సి ఉంది. ఆ లెక్కన ఫోర్‌లైన్‌కు దాదాపు 20 మీటర్లు.. అంటే 60 అడుగుల వెడల్పున ఫోర్‌ లైన్‌ నిర్మించాల్సి ఉంది. చీమకుర్తి బైపాస్‌లో ఇప్పటికే డబుల్‌ లైన్‌ ద్వారా రోడ్డు 7 మీటర్ల వెడల్పులో, రెండుపక్కల మార్జిన్‌లుగా దాదాపు ఇరువైపులా 3 మీటర్లు ఉంది.

ఇక ఫోర్‌లైన్‌కు అదనంగా 10 మీటర్లు.. అంటే 30 అడుగుల స్థలం కావాల్సి ఉంది. ఇప్పుడున్న బైపాస్‌ మార్జిన్‌ను ఆనుకుని పలు భవనాలు, వ్యాపార సముదాయాలు, పెట్రోల్‌ బంకులు వంటి నిర్మాణాలు ఉన్నాయి. దాదాపు 30 అడుగుల మేర ఫోర్‌లైన్‌కు చీమకుర్తి బైపాస్‌లో స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ఆ లెక్కన బైపాస్‌లో విలువైన భవనాలు, ఇంటి స్థలాలు, పొలాలు రోడ్డు విస్తరణలో కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో చీమకుర్తి పట్టణ వాసులు కొంత మంది చీమకుర్తి మెయిన్‌రోడ్డులోనే పట్టణంలో నుంచి ఫోర్‌లైన్‌ నిర్మిస్తే పట్టణం డివైడర్లతో అందంగా ఉంటుందని అంటున్నారు. దాని వలన పట్టణం, వ్యాపార సముదాయాలు అందంగా రూపుదిద్దుకుని అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఫోర్‌లైన్‌ను చీమకుర్తి పట్టణంలో నుంచే నిర్మించాలని ఆకాంక్షిస్తున్నారు. అలా చేయాలంటే పట్టణంలోని వ్యాపార సముదాయాలను రోడ్డుకు ఇరువైపులా 30–50 అడుగుల వెడల్పున కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో మరికొందరు ఫోర్‌లైన్‌ను పట్టణంలో నుంచి కాకుండా ఊరు బయట బైపాస్‌వైపే నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం బైపాస్‌ వైపు ఫోర్‌ లైన్‌ నిర్మిస్తే ఇప్పుడున్న బైపాస్‌ను ఆనుకుని ఉన్న విలువైన స్థలాలు పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఇక, సంతనూతలపాడు, పొదిలి పట్టణంలో నుంచి కాకుండా ఊరి బయట నుంచి బైపాస్‌లతో ఫోర్‌లైన్‌ నిర్మించాలని భావిస్తున్నారు.

ఉత్తరం వైపు కట్టపై నిర్మించేందుకే ఆర్‌అండ్‌బీ అధికారుల మొగ్గు...

ఆర్‌అండ్‌బీ అధికారులు మాత్రం చీమకుర్తిలో సాగర్‌ కాలువపై ఉత్తరం వైపున్న కట్టపై ఇప్పుడున్న డబుల్‌ లైన్‌ బైపాస్‌ను ఆనుకునే ఫోర్‌లైన్‌ నిర్మించేందుకు మొగ్గు చూపుతున్నారు. దక్షిణం వైపు నిర్మిస్తే కాలువ కట్టపై ఎంట్రెన్స్‌లో, ఎండింగ్‌లో రెండు వంతెనలు నిర్మించాల్సి వస్తుందని, అది అదనపు ఖర్చని అంటున్నారు.

పీపీపీ పద్ధతిలోనే నిధుల సేకరణ...

పేరుకు ఫోర్‌లైన్‌ అని ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించినప్పటికీ దానిని నిర్మించేందుకు కావాల్సిన నిధులను పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో సేకరించాలని నిర్ణయించారు. నిర్మించే కాంట్రాక్టర్‌ టెండర్‌లో వర్క్‌ ఆర్డర్‌ దక్కించుకున్న తర్వాత నిర్మాణం పూర్తయ్యాక ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసి రోడ్డు నిర్మాణానికి పెట్టిన డబ్బును వడ్డీతో సహా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. దీంతో ఫోర్‌లైన్‌ నిర్మించిన తర్వాత వాహనదారులపై భారం పడే అవకాశం ఉంది.

పీపీపీ పద్ధతిలోనే ఫోర్‌లైన్‌ నిర్మాణం

ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు దాదాపు 113 కిలోమీటర్ల పొడవున ఫోర్‌లైన్‌ నిర్మించనున్నాము. పీపీపీ పద్ధతిలో టెండర్లు పిలుస్తారు. ప్రస్తుతం సర్వే నిర్వహించి ఎంత ఖర్చవుతుంది, సేకరించాల్సిన భూమి ఎంత వంటివి పూర్తయ్యాక టెండర్ల ప్రక్రియ జరుగుతుంది.

– రామ్‌నాయక్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, ఒంగోలు

రోడ్డెక్కని ఫోర్‌ లైన్‌ పనులు.!1
1/1

రోడ్డెక్కని ఫోర్‌ లైన్‌ పనులు.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement