
పుస్తక మహోత్సవంలో చిన్నారుల సందడి
ఒంగోలు టౌన్: స్థానిక పీవీఆర్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవంలో ఆదివారం మూడో రోజు చిన్నారుల సందడి కనిపించింది. ఆదివారం సెలవు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, చిన్నారులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు, సాహితీ ప్రియులు తరలివచ్చారు. పిల్లల కథల పుస్తకాలు, కామిక్స్, యాక్టివిటీ పుస్తకాలను పిల్లలు కొనుగోలు చేశారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంజులూరు కృష్ణకుమారి, సీఏ ప్రసాద్ పర్యవేక్షణలో చిన్నారులకు సృజనాత్మక రచన వర్క్‌షాప్ నిర్వహించారు. దాదాపుగా 40 మంది చిన్నారులు ఈ వర్క్‌షాపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొందరు చిన్నారులు కథలు రాయగా, మరికొందరు పిల్లలు తమకు నచ్చిన బొమ్మలు గీసి అభినందనలు అందుకున్నారు. అనంతరం ఎన్‌బీటీ ప్రచురించిన బాలల సాహిత్యం జుజూరానా, మంచిమిత్రులు, షేరా–మిత్తు, బుజ్జి గుడ్లగూబ, బాలు అండ్ తోకల కథలను ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షత వహించగా ఎన్‌బీటీ దక్షిణ భారత ఇన్‌చార్జి పత్తిపాక మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్ పుస్తకాలను ఆవిష్కరించారు. తదనంతరం జరిగిన చర్చా వేదికలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికలో తమను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి జిల్లా ప్రముఖులు ప్రసంగించారు.
ఆకట్టుకున్న మ్యాజిక్ షో...
శాసీ్త్రయ సమాజం కోసం పోరాడుతున్న జన విజ్ఞాన వేదిక నిర్వహించిన ఇంద్రజాల ప్రదర్శన చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంది. గాజు పెంకుల మీద నడవడం, మేకుల మీద నిలబడటం వంటి ప్రదర్శలు ఆలోచనలు రేకెత్తించాయి. పగిలిన గాజు పెంకుల మీద ఎలాంటి గాయాలు కాకుండా నడుస్తుంటే చిన్నారులు ఆశ్చర్యంతో తిలకించారు. కార్యక్రమంలో నల్లూరి వెంకటేశ్వర్లు, బుచ్చిబాబు, రవికుమార్, ఉదయ కిరణ్, కె.లక్ష్మయ్య, రహంతుల్లా, చిలకమర్తి పద్మజ, రహ్మానుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

పుస్తక మహోత్సవంలో చిన్నారుల సందడి