
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
మద్దిపాడు: పెండింగ్ కేసులన్నింటినీ వేగంగా పరిష్కరించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌ను ఆదివారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌ను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ నిర్వహణపై ఎస్‌ఐ శివరామయ్యకు సలహాలు, సూచనలు చేశారు. 2020 నుంచి రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులు, మిస్సింగ్ కేసుల వివరాలడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని ఎస్‌ఐని ఆదేశించారు. అనంతరం స్టేషన్లోని ఫోన్లను పరిశీలించారు. డయల్100కు వచ్చే కాల్స్ విషయంలో సిబ్బంది ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో పరిశీలించారు. స్టేషన్ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ ఉన్నారు.