మర్రిపూడి: పశువులను అపహరించి సంతల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాను మర్రిపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ రమేష్‌బాబు ఆ వివరాలు వెల్లడించారు. పొదిలి, మర్రిపూడి, చీమకుర్తి, కొండపి, కొనకనమిట్ల తదితర మండలాల్లో మేత కోసం పొలం వెళ్లిన పశువులను ట్రాలీ వాహనాల్లో ఎక్కించి అక్రమంగా తరలిస్తున్నారు. ఆ సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారిపై మారణాయుధాలతో దాడి చేస్తున్నారు. అపహరించిన పశువులను గుట్టుచప్పుడు కాకుండా ఇతర జిల్లాల్లోని పశువుల సంతకు తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఇలాంటి పశువుల అపహరణ సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి.
మర్రిపూడి మండలంలోని పలు గ్రామాల్లో ఘటనలు...
మర్రిపూడి మండలంలోని గుండ్లసముద్రం, మర్రిపూడి, కూచిపూడి, రేగలగడ్డ తదితర గ్రామాల్లో వరుసగా పశువుల అపహరణ ఘటనలు చోటుచేసుకున్నాయి. దాంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోని అనేక గ్రామాల్లోనూ పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న వారికి చెందిన పశువులు అపహరణకు గురయ్యాయి. పశుపోషకులు వారి పశువులను మేత కోసం ఆయా గ్రామాల పరిసరాల్లోని బీడు భూములకు తోలతారు. అనంతరం వాటికి ఎవరూ కాపలా ఉండరు. మేత మేయడం పూర్తయిన తర్వాత సాయంత్రానికి వాటంతట అవే ఆయా గ్రామాల్లోని యజమానుల నివాసాలకు చేరుకుంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని పశువుల అపహరణ ముఠా రెచ్చిపోయింది.
దొంగలే పశుకాపరుల అవతారమెత్తి...
పశుకాపరులెవరూ లేకుండా బీడు భూముల్లో మేతమేస్తూ మందలుగా ఉన్న పశువులను దొంగలు గుర్తిస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరూ లేని సమయం చూసి ఓ పథకం ప్రకారం పశుకాపరుల అవతారమెత్తి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వాటిని తోలుకుపోతారు. అక్కడ ఓ పథకం ప్రకారం ముందే సిద్ధంగా ఉంచిన ట్రాలీ వాహనాల్లో బలవంతంగా పశువులను ఎక్కిస్తారు. నేరుగా ఇతర జిల్లాల్లోని సంతకు తరలిస్తారు. వాటిని సంతలో అమ్మి వచ్చిన సొమ్ముతో జల్సా చేసుకుంటారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా కొన్నాళ్లు వేచి ఉండి ఆ తర్వాత మళ్లీ పశువుల అపహరణకు పాల్పడతారు. గ్రామాల్లో తిరుగుతూ అదును చూసి పశువులను మాయం చేస్తూ ఉంటారు. పశువులను కోల్పోయిన వారు వాటి జాడ కోసం వెతికీవెతికీ వేసారిపోతుంటారు. ఇలా అదృశ్యమవుతున్న పశువుల సంఖ్య క్రమంగా పెరిగిపోవడంతో బాధిత పశుకాపరులంతా ఏకమై తమ పశువుల జాడ చూపాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో
స్పందించిన పోలీసులు...
మర్రిపూడి మండలంలోని గ్రామాల్లో పశువులు అపహరణకు గురవుతూ బాధిత పశుపోషకుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో సాక్షి దినపత్రికలో గత జూలై 25వ తేదీ పశువుల అపహరణ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి స్పందించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి మర్రిపూడి మండలంలోని రేగలగడ్డ సమీపంలో చెరువు కట్ట వద్ద అనుమానాస్పదంగా తారసపడిన పశువుల తరలించిన వాహనాలను స్వాధీనం చేసుకుని విచారించారు. తద్వారా అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కొనకనమిట్లకు చెందిన నలుగురు, పొదిలికి చెందిన ముగ్గురు నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో పశువులను అపహరించింది తామేనని వారు అంగీకరించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న నాలుగు ట్రాలీ వాహనాలు, ఓ ద్విచక్ర వాహనంతో పాటు పలు మారణాయుధాలు, రూ.4.55 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నిందితులను పొదిలి కోర్టులో హాజరుపరచనున్నట్లు మర్రిపూడి ఎస్‌ఐ టీ రమేష్‌బాబు తెలిపారు.
నిందితులతో మర్రిపూడి ఎస్‌ఐ రమేష్‌బాబు
నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న గేదెలను అక్రమంగా తరలించిన ట్రాలీ వాహనాలు
ఏడుగురిని అదుపులోకి తీసుకున్న మర్రిపూడి పోలీసులు
నాలుగు ట్రాలీ వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం, రూ.4.55 లక్షల నగదు స్వాధీనం
పశువుల అపహరణ ముఠా అరెస్ట్
పశువుల అపహరణ ముఠా అరెస్ట్