
పుస్తకాల పండుగ.!
ఒంగోలు టౌన్:
నగరంలో పుస్తకాల పండుగ జరుగుతోంది. ఏడేళ్ల సుదీర్ఘకాలం తర్వాత నగరంలో పుస్తక మహోత్సవం ఏర్పాటు చేయడంతో ప్రజలు ఎంతో ఆసక్తిగా సందర్శిస్తున్నారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ పుస్తక మహోత్సవానికి నగరంలోని అన్నివర్గాల ప్రజలు, యువకులు, విద్యార్థులైన బాలబాలికలు సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మొబైల్ ఫోన్లు వచ్చాక నేటి తరంలో పుస్తక పఠనం తగ్గిపోయిందన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవానికి భారీ స్పందన లభించడం నిర్వాహకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటి వరకూ హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు మాత్రమే పరిమితమైన పుస్తక ప్రదర్శన ఒంగోలు నగరంలో కూడా ఏర్పాటు చేయడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. 2016 సంవత్సరంలో తొలిసారిగా ఒంగోలులో పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం రెండేళ్ల తర్వాత 2018లో రెండోసారి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. తిరిగి ఏడేళ్ల తర్వాత ఇప్పుడు పుస్తక మహోత్సవం జరుగుతుండటంతో పండుగ వాతావరణం కనిపిస్తోంది.
అందుబాటులో లక్ష పుస్తకాలు...
పుస్తక ప్రదర్శనలో 600 మంది ప్రచురణకర్తలకు సంబంధించిన లక్ష పుస్తకాలు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన చందమామ కథల పుస్తకాలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రపంచ ప్రసిద్ది చెందిన జార్జీ బెర్నాడ్డ్ షా, లియో టాల్‌స్టాయ్, డీల్ కార్నగీ, నెపోలియన్ హీల్, ప్యూడోర్ దోస్తోయ్‌ఎస్కీ, ఆల్బర్ట్ కాము రాసిన ఆంగ్ల సాహిత్యం పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచారు. బాలల సాహిత్యం, ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆరోగ్య రక్షణకు సంబంధించిన పుస్తకాలు, కథలు, నవలలు, కవిత్వం, కెరీర్ గైడెన్స్, లా బుక్స్ ఇంకా అనేక పుస్తకాలు ప్రదర్శనలో ఉన్నాయి. జపనీస్ మాంగా కామిక్స్, పజిల్స్, యాక్టివిటీ పుస్తకాలు ఆకట్టుకుంటున్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్, అరసం, ఎమెస్కో, అన్వీక్షణి, విశాలాంధ్ర బుక్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ లాంటి ప్రసిద్ధ సంస్థలతో పాటు మొత్తం 35 బుక్ స్టాల్స్ ఉన్నాయి. పుస్తకాల కొనుగోళ్లపై 10 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. ఇన్ని పుస్తకాలు ఒకేచోట దొరకడం చాలా అరుదైన సందర్భం కావడంతో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సాహిత్య ప్రియులు, విద్యార్థులు, యువకులు పుస్తక మహోత్సవానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
ప్రతిరోజూ సాహిత్య సమావేశాలు...
పుస్తక మహోత్సవాన్ని పురస్కరించుకుని మాదాల రంగారావు సాహిత్య వేదిక వద్ద ప్రతిరోజూ వివిధ అంశాల మీద సాహిత్య చర్చలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన 100 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ తమీమ్ అన్సారియా, మాజీ ఐఏఎస్ అధికారి ఎండీ ఇంతియాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పొన్నూరు శ్రీనివాసులు, చంద్రనాయక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 18వ తేదీ గ్రంథాలయాలు సమాజం అనే అంశం మీద చర్చ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 19వ తేదీ పాటల జయరాజ్‌తో ముఖాముఖి, 20న చలం రచించిన సీ్త్ర నవల వచ్చి 100 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని చర్చ ఏర్పాటు చేశారు. 21వ తేదీ ప్రముఖ జర్నలిస్టు తెలకపల్లి రవి రచించిన 6 పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు, చదువులపై వీరి పాత్ర అంశంపై చర్చ ఏర్పాటు చేశారు. 24న ముగింపు సభ జరగనుంది. దీంతోపాటు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించే విధంగా జనచైతన్య వేదిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి.
పుస్తక మహోత్సవంలో పుస్తకాలను పరిశీలిస్తున్న విద్యార్థినులు, వృద్ధుడు
ఒంగోలులో పుస్తక మహోత్సవానికి భారీగా తరలివస్తున్న ప్రజలు
బాలబాలికలు సైతం పుస్తకాలు కొనడానికి ఆసక్తి
సాహిత్య సమావేశాలతో నగరంలో పండుగ వాతావరణం
24 వరకు పుస్తక మహోత్సవం

పుస్తకాల పండుగ.!

పుస్తకాల పండుగ.!