ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ

Aug 17 2025 6:05 AM | Updated on Aug 17 2025 6:05 AM

ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ

ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ

మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

మార్కాపురం టౌన్‌: ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని మాజీ ఎమ్మెల్యే మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు విమర్శించారు. శనివారం ఆయన వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన ఎలక్షన్‌ కమిషన్‌, పోలీసులు, పోలింగ్‌ సిబ్బంది అధికార పార్టీతో కుమ్మక్కవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వీడియో, ఫొటోల సాక్షిగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు దొంగఓట్లు వేస్తూ పట్టుబడ్డారన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందంటూ మంత్రి లోకేష్‌ చేసిన ట్వీట్‌ వీడియోలోనే దొంగ ఓటర్లున్నారన్నారు. పోలింగ్‌ బూత్‌ను ఆక్రమించుకున్న మంత్రి రామప్రసాద్‌రెడ్డిపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏజెంట్లనే కాక కనీసం వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఓట్లు వేయనీకుండా తీవ్ర అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో గెలవడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టును ఆశ్రయించిందని, ఈ నేపథ్యంలో హడావుడిగా కూటమి ప్రభుత్వం ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ టేబుళ్లను వేసి ఎన్నికల ఫలితాలను ప్రకటించడం విడ్డూరమన్నారు. పులివెందులలో టీడీపీకి 6,716, వైఎస్సార్‌ సీపీకి 683 ఓట్లు వచ్చాయంటే రిగ్గింగ్‌ లెక్కలే చెబుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిజంగా అంతటి ప్రజాబలం ఉందని అనుకుంటే ఇన్ని అక్రమాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు. ఈనెల 5న పులివెందులలో ప్రచారం కోసం వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ పై, వైఎస్సార్‌ సీపీ నాయకుడు వేల్పుల రాముపై దాడిచేసి హత్యచేయడానికి ప్రయత్నించారని, కారుపై పెట్రోల్‌ పోసి తగులబెట్టి భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ దాడిలో గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న రాముపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం దారుణమని అన్నారు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ మరీ విడ్డూరంగా పక్కగ్రామంలో పత్తివ్యాపారం ఏంటని, ఇంకా మేం ఉండబట్టే తలలు పగిలాయి, లేదంటే తలలు తెగిపడేవి అని బాధ్యతా రహితంగా మాట్లాడటం ఐపీఎస్‌ అధికారికి తగదన్నారు. పులివెందులలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధి తుమ్మల హేమంత్‌ రెడ్డిని కనీసం ఓటు వేయనీయలేదని, ఆరోజు తెల్లవారుజామున నుంచే హౌస్‌ అరెస్టు చేశారని అన్నారు. అధికారపక్ష అభ్యర్ధిని మాత్రం స్వేచ్ఛగా వదిలేశారన్నారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి స్థానికుడైనా తెల్లవారుఝామున నుంచే ఆయన ఇంటికి వెళ్లి కనీసం చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా, ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నా వినకుండా రెండు చేతులను పట్టుకుని లాక్కుని వచ్చారన్నారు. యూనిఫాం వేసుకున్న పోలీసులు ప్రజలను రక్షించడానికా.. పాలకులు చెప్పింది చేయడానికా.. అని ప్రశ్నించారు. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన టీడీపీ గూండాలకు పోలీసులు బాసటగా నిలిచారని, ఓట్లు వేసేందుకు బయలుదేరిన వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులను అడ్డుకుని వారి స్లిప్పులు లాక్కున్నా పోలీసులు మాత్రం నోరు మెదపలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ అత్యంత దారుణంగా నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దుచేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement