
జేవీవీ రాష్ట్ర మహాసభల పోస్టర్లు ఆవిష్కరణ
ఒంగోలు టౌన్: జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర మహాసభల పోస్టర్లను శనివారం ఒంగోలులో ఆవిష్కరించారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో విజయనగరంలో జరగనున్న రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయాలని జేవీవీ సీనియర్ నాయకుడు ఏవీ పుల్లారావు పిలుపునిచ్చారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో గల జేవీవీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలలో శాసీ్త్రయ సమాజం ఏర్పాటే లక్ష్యంగా గత 38 ఏళ్లుగా జేవీవీ పనిచేస్తోందని తెలిపారు. మూఢ నమ్మకాల వలన సమాజ ప్రగతి నిలిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్స్ ఆధారంగా ఆలోచన చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యావంతులు, యువకులు సమాజ చైతన్యం కోసం జేవీవీలో భాగస్వాములు కావాలని కోరారు. జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సీహెచ్ జయప్రకాష్, యు.భాస్కర్ మాట్లాడుతూ అందరికీ మెరుగైన విద్య, నాణ్యమైన వైద్యం అందాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారులు, పాఠశాల విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.దేవప్రసాద్, ఏ విశ్వరూపం, ఎస్వీ రంగారెడ్డి, ఎన్టీ వెంకటేష్, జె.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.