
తెగుళ్లు, పెట్టుబడులు పెరిగిపోయి.. పూల రైతు వాడిపోయి..!
సాగులో ఉన్న మల్లె తోట
పూలు కోస్తున్న కూలీలు
కంభం:
మండలంలోని రావిపాడు గ్రామం పేరు వినగానే గుర్తొచ్చేది పూల సువాసనలు. పూల తోటల సాగుకు ఈ గ్రామం పెట్టింది పేరు. ఇక్కడ పండించే మల్లె, జాజి పూలు రాష్ట్ర నలుమూలలకు ఎగుమతి అవుతుంటాయి. వంద సంవత్సరాల క్రితం నుంచే ఈ గ్రామంలో పూలతోటలు సాగుచేస్తూ వస్తున్నారు. పూర్వం బత్తాయి తోటలు సాగుచేస్తూ మధ్యలో అక్కడక్కడా మల్లెపూల చెట్లు వేసేవారు. పూలు బాగా కాస్తూ మంచి రేటుకు అమ్ముడుపోతుండటంతో కాలక్రమంలో పూలతోటలే సాగుచేస్తూ రైతులు ఆదాయం పొందుతున్నారు. గతంలో 300 నుంచి 400 ఎకరాల్లో మల్లె, జాజి పూలతోటలు సాగుచేస్తుండగా, ప్రస్తుతం తెగుళ్లు, చీడపీడలతో పాటు పెరిగిన పెట్టుబడుల కారణంగా సాగు తగ్గుతూ వచ్చి కేవలం 50 నుంచి 60 ఎకరాల్లోనే పూలతోటలు సాగులో ఉన్నాయి.
తమిళనాడు నుంచి అంటు తెచ్చి...
రామేశ్వరం, మధురై, కుంభకోణం నుంచి మల్లె అంట్లు తెచ్చి రావిపాడు గ్రామంలోని పొలాల్లో రైతులు నాటుతారు. మొక్కలు నాటిన తొలి రెండు సంవత్సరాలు చిన్నపిల్లల్లా వాటిని చూసుకుంటారు. రెండేళ్లకు కోతకు వస్తాయి. అప్పటికే ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది.
ఇతర ప్రాంతాలకు రవాణా...
రావిపాడులో పండిన మల్లె, జాజి పూలకు మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండిన పూలు గతంలో మన జిల్లాతో పాటు వినుకొండ, నరసరావుపేట, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు సరఫరా అయ్యేవి. ఇటీవల కాలంలో సాగు తగ్గడంతో ప్రస్తుతం మార్కాపురం, గిద్దలూరు, పోరుమామిళ్ల, పొదిలి, కనిగిరి వంటి ప్రాంతాలకు మాత్రమే పంపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ పూలు రూ.150 వరకు ధర పలుకుతున్నాయి.
తెగుళ్లతో తగ్గిపోతున్న దిగుబడి,
సాగు విస్తీర్ణం...
మల్లె, జాజి తోటలకు ఎర్రనళ్లి తెగులు, ఎర్రమొగ్గ తెగులు, ముడత తెగులు, బొబ్బతెగులు బెడద అధికమవడంతో దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఒకసారి నాటిన చెట్లు పదేళ్ల వరకు కాపు కాస్తాయి. నెలకు ఒక కాపు వస్తుండగా, గతంలో కాపునకు సుమారు 100 కేజీల వరకూ దిగుబడి వచ్చేది. ప్రస్తుతం తెగుళ్ల కారణంగా 20 నుంచి 25 కేజీల వరకు దిగుబడి తగ్గిపోయింది. దీంతో క్రమంగా సాగు విస్తీర్ణం కూడా తగ్గింది.
పట్టించుకోని ఉద్యానవన శాఖాధికారులు...
ప్రస్తుతం రావిపాడు గ్రామంలో 50 ఎకరాలకుపైగా మల్లె, జాజి తోటలు సాగులో ఉన్నాయి. తెగుళ్లు, వైరస్‌ల బెడద అధికంగా ఉండటంతో దిగుబడి తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చివరకు సాగు విస్తీర్ణం కూడా భారీగా తగ్గిపోయినప్పటికీ ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖల అధికారులు ఆ తోటల వైపు కన్నెత్తి కూడా చూడలేదని రైతులు వాపోతున్నారు. గతంలో చీడపీడల బెడద తక్కువగా ఉండేదని, ఇటీవల అధికమవడంతో దిగుబడి తగ్గిపోయి నష్టాలకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ అధికారి కూడా తమ పూలతోటలవైపు కన్నెత్తి చూడటం లేదని, ఏ తెగులుకు ఏ మందు వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తమకు అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. దుకాణదారులు ఏ మందు చెబితే అది గుడ్డిగా తెచ్చుకొని పొలాలకు వాడుకుంటున్నామని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మల్లె సాగులో రైతులకు మెళకువలు నేర్పించడంతో పాటు జాగ్రత్తలు, సూచనలు అందిస్తేనే పూల సాగుకు రైతులు ముందుకొస్తారని చెబుతున్నారు.

తెగుళ్లు, పెట్టుబడులు పెరిగిపోయి.. పూల రైతు వాడిపోయి..!

తెగుళ్లు, పెట్టుబడులు పెరిగిపోయి.. పూల రైతు వాడిపోయి..!