
శంకుస్థాపన సరే..పనులెప్పుడు..?
మార్కాపురం టౌన్: మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశాల నిర్వహణ కోసం భవన నిర్మాణానికి గత ఏడాది నవంబర్‌లో సబ్ కలెక్టర్ త్రివినాగ్, ఎమ్మెల్యే కందుల శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన చేసి 8 నెలలు దాటినా ఇంత వరకు పనులు అడుగు ముందుకు పడలేదు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.55 లక్షలు కేటాయించింది. అయితే భవన నిర్మాణానికి అక్కడ ఉన్న చెట్లు అడ్డు వస్తాయని కాంట్రాక్టర్ వాటిని తొలగించాడు. అయితే ఆ తర్వాత పనులు పునాదిలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. కలెక్టర్, మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల సమావేశాల కోసం రెవెన్యూ అధికారులు ప్రైవేట్ కల్యాణ మండపాలకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు అద్దె చెల్లించి తీసుకుంటున్నారు. దీంతో సమావేశం పెట్టాలంటేనే రెవెన్యూ అధికారులు భయపడుతున్నారు. మరో వైపు నిధులున్నా, అన్ని అనుమతులు ఉన్నా పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోనే నిర్మాణం చేపట్టాల్సి ఉంది. శంకుస్థాపన చేసిన పునాది గుంతలో పిచ్చి చెట్లు పడ్డాయి. దీంతో ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమానికి వచ్చే ప్రజలు, అర్జీదారులు ఉన్న కాసింత ఖాళీ స్థలంలోనే వేచి ఉండి లోపలికి వెళ్లి అర్జీలు ఇస్తున్నారు. మరో వైపు నిర్మాణం పూర్తయితే తమకు అద్దె భాద తప్పిపోతుందని రెవెన్యూ అధికారులు భావిస్తుండగా నిర్మాణ పనులు అడుగు ముందుకు పడటం లేదు. నూతన భవనం నిర్మించాలంటే ముందు పాత ఎంప్లాయిమెంట్ ఆఫీసు ఉంది. దాన్ని తొలగించాలంటే జిల్లా అధికారుల అనుమతి అవసరం. దీంతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని తెలిసింది. నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారో వేచి చూడాల్సిందే.
సమావేశ మందిరానికి శంకుస్థాపన చేసి
8 నెలలు
అడుగు ముందుకు పడని పనులు
ఉన్నతాధికారుల సమావేశాలకు భారంగా
అద్దె చెల్లింపు

శంకుస్థాపన సరే..పనులెప్పుడు..?