
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
కొండపి: ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని పెద్దకండ్లకుంటలో ఆదివారం జరిగింది. ఎస్సై ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పాలపర్తి రాజశ్రీ (29) కొన్నేళ్ల క్రితం పాలపర్తి పోతురాజును ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త తరుచూ మద్యం తాగి వస్తుండటంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన అత్త చూసేసరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొండపి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
ముగిసిన
శ్రీగిరి పవిత్రోత్సవాలు
ఒంగోలు మెట్రో: ఒంగోలు కొండమీద శ్రీగిరి వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ఆదివారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు శ్రీగిరి వెంకటేశ్వర స్వామికి నిర్వహించిన వివిధ కార్యక్రమాలను భక్తులు ప్రత్యక్షంగా తిలకించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత వేద పండితులు పరాంకుశం సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో హోమ క్రతువులతో పాటు శ్రీవారికి విశేష స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నేత్రపర్వంగా వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంతో శ్రీగిరి శ్రీవారి పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్ పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు సుశీలాదేవి, కార్య నిర్వహణ ధర్మకర్త సీవీ రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మికుమారి, శ్రీగిరి దేవస్థానం ఉత్తర అమెరికా ప్రతినిధి డాక్టర్ ఆలూరు శ్రీనివాస చరణ్ రాజీవ్, ఆలూరు జై శంకర్, ఆలూరు కుమార్ ఆత్రేయ, ఆలూరు ఫణికుమార్ తదితరులు పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు శ్రీగిరి దేవస్థానం నిర్వాహకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు,
ఎఫ్‌ఏ–1 ప్రశ్నపత్రాలు
సీఆర్పీల ద్వారా చేర్చాలి
ఒంగోలు సిటీ: ఎఫ్‌ఏ–1 ప్రశ్న పత్రాలు సీఆర్పీల ద్వారా పాఠశాలలకు చేర్చాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటరావు, ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు క్లస్టర్‌కు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఎమ్మార్సీ సెంటర్లకు వెళ్లి ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లాలని మండల విద్యాశాఖ అధికారులు ఆదేశాల జారీ చేశారని తెలిపారు. జిల్లాలో చాలా పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా నడుస్తున్నాయన్నారు. కొన్ని పాఠశాలలు మండల కేంద్రానికి 20 నుంచి 30 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయని, పాఠశాలను వదిలి పరీక్ష పేపర్లకు వెళ్లటం వల్ల చాలామంది మహిళా ఉపాధ్యాయులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వారు మండల కేంద్రాలకు వెళ్లేందుకు సమయం చాలదు కనుక కాంప్లెక్స్‌ల్లో ప్రశ్నపత్రాలు చేర్చి సీఆర్పీల ద్వారా పాఠశాలలకు సరఫరా చేయాలని కోరారు.
బీచ్‌లో యువకుడిని కాపాడిన మైరెన్ సిబ్బంది
కొత్తపట్నం: స్థానిక పల్లెపాలెం బీచ్‌లో ఓ యువకుడు గల్లంతయ్యే సమయంలో మైరెన్ సిబ్బంది కాపాడారు. ఒంగోలు నగరానికి చెందిన ఎం.హేమంత్ మరో ముగ్గురు యువకులతో కలిసి ఆదివారం కావడంతో సముద్రస్నానానికి బీచ్‌కి వచ్చాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉధృతికి నీటిలో మునిగిపోయి హేమంత్ గల్లంతవుతున్నాడు. సముద్రతీరంలో విధులు నిర్వర్తిస్తున్న మైరెన్ హోంగార్డులు శ్రీరాములు, కృష్ణ వెంటనే స్పందించి అలలకు ఎదురెళ్లి అతి కష్టం మీద హేమంత్‌ను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే అతను నీరు మించి ఊపిరాడక స్పృహతప్పిపోయాడు. కడుపు నొక్కి నీటిని బయటకు కక్కించిన మైరెన్ సిబ్బంది.. కొన ఊపిరితో ఉన్న హేమంత్‌ను 108 అంబులెన్స్ పిలిపించి ఆక్సిజన్ పెట్టించి కొత్తపట్నంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది చికిత్స చేయడంతో హేమంత్ సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో అతని తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఊపిరి పీల్చుకుని మైరెన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బందిని సీఐ ఎస్.సాంబశివరావు, ఎస్సై పి.సుబ్బారావు అభినందించారు.

ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య