వైస్ ఎంపీపీల ఎన్నిక ఏకగ్రీవం
మార్కాపురం టౌన్/త్రిపురాంతకం: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై సత్తా చాటారు. జిల్లాలో మార్కాపురం, త్రిపురాంతకం మండలాల్లో ఖాళీ అయిన ఉపాధ్యక్ష స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. మార్కాపురం మండలం వైస్ ఎంపీపీ–2గా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడు కుందురు మాల్లారెడ్డి, త్రిపురాంతకం వైస్ ఎంపీపీగా పాటిబండ్ల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మార్కాపురం మండల పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి, డీఎల్‌పీవో కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. మండలంలో మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులు, ఒక కోఆప్షన్ సభ్యుడు ఉన్నారు. వీరిలో 11 మంది సభ్యులు వైస్ ఎంపీపీగా కుందురు మల్లారెడ్డిని బలపరిచారు. మల్లారెడ్డికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రం అందించి, ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా వైస్ ఎంపీపీ స్థానానికి బరిలో నిలిచిన కుందురు మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు తన నివాసంలో సోమవారం బి–ఫారం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నారు బాపన్‌రెడ్డి, ఎంపీపీ బి.లక్ష్మీదేవి, ఎంపీటీసీ సభ్యులు పి.అరుణ చెంచిరెడ్డి, లక్ష్మమ్మ, పేతురు, సంధ్యారాణి, లక్ష్మీదేవి, వీరమ్మ, వెంకటసుబ్బమ్మ, వీరనారాయణమ్మ, ఎల్లమ్మ, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మల్లారెడ్డికి అభినందనలు
మార్కాపురం మండల వైస్ ఎంపీపీగా ఎన్నికై న మల్లారెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డి అభినందించారు. మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పార్టీ ఏపీ మున్సిపల్ విభాగ కమిటీ సెక్రటరీ వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు నాయకులు, అధికారులు అభినందనలు తెలియజేశారు.
త్రిపురాంతకంలో..
త్రిపురాంతకం మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పాటిబండ్ల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ మేడపి ఎంపీటీసీ సభ్యుడు కృష్ణ పేరును ప్రతిపాదించగా ముడివేముల ఎంపీటీసీ సాయపునేని సుబ్బారావు, మిగిలిన సభ్యులు బలపరిచారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎంపీటీసీ సభ్యులను సమన్వయపరిచి ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా కృషి చేశారు. ఈ మేరకు పాటిబండ్ల కృష్ణతో ఎన్నికల అధికారి, మండల ప్రత్యేకాధికారి అయిన వండర్‌మేన్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎంపీడీఓ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం, త్రిపురాంతకంలో మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికలు రెండు మండలాల్లోనూ సత్తా చాటిన వైఎస్సార్ సీపీ వైస్ ఎంపీపీలుగా ఎన్నికై న కుందురు మల్లారెడ్డి, పాటిబండ్ల కృష్ణ
వైస్ ఎంపీపీల ఎన్నిక ఏకగ్రీవం
వైస్ ఎంపీపీల ఎన్నిక ఏకగ్రీవం


