కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందా? | - | Sakshi
Sakshi News home page

కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందా?

May 3 2025 8:25 AM | Updated on May 3 2025 8:25 AM

కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందా?

కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందా?

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య జరిగి 12 రోజులైంది. ఈ కేసులో ఇప్పటి వరకు పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అన్నీ కోణాల్లో విచారణ చేస్తున్నారు. హత్యకు గురైన వీరయ్య చౌదరి, హత్యకు ప్లాన్‌ చేసినట్లు చెబుతున్న ప్రధాన అనుమానితులంతా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావడంతో ఈ కేసుపై ఎనలేని ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా హతుడు వీరయ్య చౌదరికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ సన్నిహితుడు కావడం పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఇప్పటికే ప్రధాన అనుమానితుడిగా ఉన్న అమ్మనబ్రోలు వాసి, టీడీపీ యువ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మనబ్రోలుకు చెందిన మరో టీడీపీ సానుభూతిపరుడైన హవాలా వ్యాపారి కోసం గాలిస్తున్నారు. హత్యలో ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతున్న కొప్పోలు వాసి కోసం వైజాగ్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరితో పాటుగా దాదాపుగా 150 మందికి పైగా అనుమానితులను తీసుకొచ్చి విచారిస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు ఈ కేసు గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. అమరావతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వచ్చి వెళ్లారు. మూడు రోజులుగా పోలీసులు పీఎం సభ బందోబస్తులో బిజీగా ఉన్నారు. ఆ పని కాస్త అయిపోవడంతో ఇక వీరయ్య చౌదరి కేసులో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర జాప్యం కావడంతో తమ వద్దనున్న నిందితులపై కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

నిందితులంతా టీడీపీ నాయకులే...

టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. హత్యకు గురైన వీరయ్య చౌదరి టీడీపీలో చాలా క్రియాశీలక నాయకుడు. ఆయన హత్య కేసులో ఉన్న అమ్మనబ్రోలుకు చెందిన ప్రధాన అనుమానితుడు కూడా టీడీపీలో క్రియాశీలక నాయకుడు కావడం గమనార్హం. ఆయన తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అంతే కాకుండా సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆయనతో పాటుగా ఈ హత్య కేసులో డబ్బులు సమకూర్చినట్లు ప్రచారం జరుగుతున్న మరో ప్రధాన అనుమానితుడు కూడా తెలుగుదేశంతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది. హత్య చేసిన నిందితులకు డబ్బులు అందజేసినట్లుగా చెబుతున్న ఓ సిద్ధాంతి కూడా టీడీపీకి చెందినట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇలా పై నుంచి కింద దాకా ఈ హత్య కేసులో అంతా టీడీపీ వారే కావడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. అందుకే ఈ కేసు గురించి టీడీపీ ప్రజా ప్రతినిధులు ఎక్కడా నోరువిప్పి మాట్లాడడం లేదు.

విచారణ ఆలస్యంపై అనుమానాలు...

నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసులో విచారణ జాప్యం అవుతుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్రిల్‌ 22వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో వీరయ్య చౌదరి హత్య జరిగింది. హత్య జరిగిన రోజు రాత్రే రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒంగోలుకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పోలీసు అధికారులతో మాట్లాడారు. హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరుసటి రోజు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు హోం మంత్రితో పాటుగా పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు. మరుసటి రోజు వీరయ్య అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు వీరయ్య హంతకులను ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అసలు హంతకులు నేల మీద ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అయితే కేసు లోతుల్లోకి వెళితే అంతా టీడీపీ నాయకులే ఉండడంతో పోలీసు అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదని తెలుస్తోంది. అందువల్లనే కేసు విచారణ ఆలస్యమవుతోందా అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నాయకుల గుండెల్లో గుబులు...

వీరయ్య చౌదరి హత్య జరిగినప్పటి నుంచే టీడీపీ నాయకుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో హత్యకు గురైన నాయకుడు, హత్యకు ప్లాన్‌ చేసిన వారు టీడీపీ నాయకులే కావడంతో పార్టీ నాయకులు, శ్రేణుల గుండెల్లో రాయి పడ్డట్టయిందని చెబుతున్నారు. అంతేకాకుండా వీరయ్య హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ యువ నాయకుడితో జిల్లా ఎమ్మెల్యేలకు, ముఖ్యులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనుమానితుడితో కలిసి మాట్లాడిన వారిని, భోజనాలు చేసిన వారిని, ఫొటోలు తీయించుకున్న వారిని పోలీసులు విచారణకు పిలుస్తుండడం మరింత ఆందోళనకు గురి చేస్తోందని చెప్పుకుంటున్నారు. కేసు ఫైనల్‌ అయ్యే వరకు ఈ నాయకులు నిద్ర పోయే పరిస్థితి కూడా లేదన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మొత్తం మీద వీరయ్య చౌదరి కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని టీడీపీ శ్రేణులు బెంగపడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.

వీరయ్య చౌదరి హత్య కేసులో విచారణ పూర్తయినట్లేనా పోలీసుల అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు నిందితులంతా అధికార టీడీపీ వారే కావడంతో సర్వత్రా ఆసక్తి పోలీసుల అదుపులోనే ప్రధాన అనుమానితులు పాత్రధారుల కోసం కొనసాగుతున్న గాలింపు జిల్లా టీడీపీ నేతల్లో కలవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement