
లా అండ్ ఆర్డర్‌పై ప్రత్యేక దృష్టి
పశ్చిమ ప్రకాశంలో
మార్కాపురం: పశ్చిమ ప్రకాశంలో లా అండ్ ఆర్డర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీఎస్పీ బాలసుందరరావు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో సీఐ ఆవుల వెంకటేశ్వర్లుతో కలసి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొమరోలు, యర్రగొండపాలెం ప్రాంతాల్లో చిన్న సంఘటనలు మినహా ఎక్కడా గొడవలు జరగలేదని, అందరూ సహకరించారని అన్నారు. కౌంటింగ్ అనంతరం ఊరేగింపులు,ర్యాలీలుటపాసులు కాల్చడం లాంటి కార్యక్రమాలకు అనుమతిలేదన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘాపెట్టామన్నారు. డివిజన్‌లోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో మొత్తం 7 వేల మందిపై బైండోవర్ కేసులు పెట్టామన్నారు. వచ్చేనెల 6 వరకూ ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. గొడవలు, అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదుచేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రతి పోలీసు అధికారి గ్రామాలకు వెళ్లి పల్లెనిద్ర చేయాలని ఎస్పీ ఆదేశించినట్లు తెలిపారు. కార్డన్ సెర్చ్ కార్యక్రమం కౌంటింగ్ వరకూ కొనసాగుతుందన్నారు. పేలుడు పదార్థాలు, అనుమానిత వ్యక్తులు, అనుమతి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకూ సుమారు 2 వేల వాహనాల వరకూ సీజ్ చేసినట్లు తెలిపారు. కత్తులు, బాంబులు, ఇతర మారణాయుధాలు ఉంటే ఆర్‌మ్స్ యాక్ట్ పెడతామని చెప్పారు. క్రాకర్స్ అమ్మేవారు కూడా బల్క్‌గా అమ్మవద్దని హెచ్చరించినట్లు తెలిపారు. డీజేలకు పర్మిషన్ లేదన్నారు.
సోషల్‌మీడియాపై నిఘా:
తాము ఏర్పాటు చేసుకున్న వాట్సప్ గ్రూపుల ద్వారా వదంతులు, చట్టవ్యతిరేక మెసేజులు, ఉద్రేకాలు, గొడవలు సృష్టించేలా ఉండే గ్రూపులపై నిఘా పెట్టామని, అలాంటివారిపై కూడా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండాలని పోలీసులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట పట్టణ ఎస్సై అబ్దుల్ రెహమాన్ ఉన్నారు.
కౌంటింగ్ అనంతరం గొడవలకు
పాల్పడితే రౌడీషీట్ ఓపెన్
ఇప్పటికే 7 వేల మందిపై బైండోవర్ కేసులు
గ్రామాల్లో పోలీసు అధికారుల పల్లెనిద్ర
డీఎస్పీ బాలసుందరరావు వెల్లడి