- కూటమి నేతల కప్పం డిమాండ్లతో పారిశ్రామిక రంగం కుదేలు
- వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఫైర్
తాడేపల్లి: రాష్ట్రంలో వెన్నుపోటు కూటమి వేధింపులు, కప్పం డిమాండ్ల వల్లే ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వరుసపెట్టి పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని విమర్శించారు. కొత్త పరిశ్రమలు రావడం మాట అటుంచితే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు కూడా రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు.
రూ.6,675 కోట్ల పెట్టుబడితో నెల్లూరులో ఏర్పాటు కావాల్సిన టాటా పవర్ ప్రాజెక్ట్ ఒడిశాకు వెళ్లిపోయిందని, రూ.3,538 కోట్ల పెట్టుబడితో నాయుడుపేటలో ఏర్పాటు కావాల్సిన వెబ్‌సోల్ ప్రాజెక్ట్ వెస్ట్ బెంగాల్‌కు వెళ్లిపోయిందని అన్నారు. ఈ సంస్థలు ఎందుకు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, అయితే ఆ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయో, ఏ పరిశ్రమలు ఏర్పాటయ్యాయో, 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని పుత్తా శివశంకర్ సవాల్ చేశారు. పూర్తి వివరాలు ఇవ్వలేకపోతే కనీసం 10 శాతం ఉద్యోగాల వివరాలైనా వెల్లడించాలని పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
భూముల రద్దు.. కంపెనీల వెళ్లగొట్టింపు
గత వైఎస్ జగన్ గారి హయాంలో అనకాపల్లిలో కోకాకోలా సంస్థకు, సత్యసాయి జిల్లాలో ఈవీ వాహనాల తయారీ సంస్థ ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను ఈ ప్రభుత్వం అకారణంగా వెనక్కి లాక్కుని ఆ సంస్థలను తరిమేసింది. అనంతపురం జిల్లాలో జిన్ఫ్రా ప్రెసిడెన్స్, అనకాపల్లిలో జూపిటర్ ప్రాజెక్టు భూములను కూడా రద్దు చేసి వేల మంది ఉపాధికి గండికొట్టారు. మరోవైపు రాయలసీమలో అల్ట్రాటెక్, దాల్మియా, భారతీ తదితర సిమెంట్ పరిశ్రమల వద్ద టీడీపీ నేతలు ట్రాన్స్‌పోర్ట్, బూడిద కాంట్రాక్టుల కోసం తీవ్ర బెదిరింపులకు పాల్పడుతూ పారిశ్రామికవేత్తలను భయాందోళనలకు గురిచేస్తున్నారు.
సిమెంట్ కంపెనీలకు తీవ్ర వేధింపులు
రాయలసీమ ప్రాంతంలోని సిమెంట్ పరిశ్రమలు, థర్మల్ ప్రాజెక్టులపై కూటమి నేతలు కక్ష సాధింపులకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాలు బూడిద, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టుల కోసం అల్ట్రాటెక్, దాల్మియా, వికాట్, శ్రీచక్ర తదితర సిమెంట్ పరిశ్రమలను తీవ్రంగా వేధిస్తున్నాయి. కలెక్టర్‌ను సైతం లెక్కచేయకుండా, తాము చెప్పిన రేటుకే రవాణా ఇవ్వాలని, లేదంటే కప్పం కట్టాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఇక భారతీ సిమెంట్స్ పై కక్ష సాధింపులో భాగంగా ఆ కంపెనీని మూసివేసేందుకు ప్రయత్నించారు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ రకరకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పతనం
కోవిడ్ కష్టకాలంలోనూ వైఎస్ జగన్ గారి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ వన్‌గా ఉన్న ఏపీ.. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎనిమిదో స్థానానికి పడిపోవడమే రాష్ట్ర దుస్థితికి నిదర్శనం. 24 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు తెచ్చామని గోబెల్స్ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. దమ్ముంటే కనీసం 10 శాతం ఉద్యోగుల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను.
రాష్ట్ర ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టి రూ.9 వేల కోట్ల అప్పులు తెచ్చినందుకు ఏపీఎండీసీకి అసోచాం అవార్డు రావడం హాస్యాస్పదం. ఇదంతా కేవలం కార్పొరేట్ లాబీయింగే. దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం మరింత సిగ్గుచేటు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ గారి ప్రభుత్వం చేసిన అప్పుల కంటే, కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిన్నర కాలంలోనే అత్యధికంగా అప్పులు చేసింది. అప్పులు తేవడంలో వీరికి మరో అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు’అని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:
‘సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్‌కు బీపీ ఎందుకు?’


