సాక్షి, తాడేపల్లి: సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్‌లకు బీపీ పెరుగుతోందని.. డీఎస్సీలో అక్రమాలపై విచారణ అంటే తట్టుకోలేక పోతున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు.
‘‘కొత్తకొత్త జీవోలతో గేట్లు ఎత్తి తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మెరిట్ లిస్టుల పేరుతో మరో మోసం చేశారు. డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చుకోవటానికే గ్రూప్-1ను తెర మీదకు తెచ్చారు. సిట్‌తో విచారణ జరిపినా గ్రూప్-1లో తప్పులు కనపడలేదు. అందుకే రెండో సిట్ వేసి తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. దమ్ముంటే సీబీఐతో విచారణ జరపాలి. డీఎస్సీ, గ్రూప్-1 రెండిటి పైనా సీబిఐ విచారణ చేయించాలి’’ అని అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
శాసనమండలిలో దీనిపై చర్చిద్దామంటే చంద్రబాబు, లోకేష్ పారిపోయారు. సీబీఐతో విచారణ అంటే ఎందుకంత భయం?. తప్పు చేసినట్టు ఇప్పటికైనా ఒప్పుకోండి. డీఎస్సీ అక్రమాలపై జనసేన, బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?. స్పోర్ట్స్ లో పాల్గొనడమే అర్హతగా ఉద్యోగాలు ఇస్తారా?. ఇలాంటి వారు పిల్లలకు ఏం పాఠాలు చెప్తారు?
ఇదీ చదవండి: ‘సర్’లో ఈ నాలుగైదు రోజులే కీలకం
..ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఏపీని గంజాయి విక్రయ రాష్ట్రంగా మార్చారు. లింగమనేని రమేష్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్‌తో ఒకరిని చంపేస్తే కేసులు ఉండవా?. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా చర్యల్లేవు. ఆదినారాయణ రెడ్డి కొడుకు గంజాయి తాగుతూ దొరికినా కేసుల్లేవు. కూటమి నేతలు, వారి పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయా?’’ అంటూ అరుణ్‌కుమార్ ప్రశ్నించారు.


