తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి ): కోర్టు కేసులున్న మున్సిపాలిటీల్లో ఈ సారైనా ఎన్నికలు జరుగుతాయా.. ప్రతిపాదిత విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహిస్తారా.. కోర్టు కేసులు ఎత్తేసి, ప్రత్యేక ఆదేశాలతో పాత వార్డులతోనే ఎన్నికలకు వెళతారా.. జిల్లాలో కోర్టు అభ్యంతరాలున్న పాలకొల్లు, తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయా.. ఇది ప్రస్తుతం అంతటా జరుగుతున్న చర్చ.. వీటిలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నిక జరిగే అవకాశాలున్నా, వాటిని ఆపడానికి కూటమి నాయకుల తరఫున ఎవరైనా ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాచారం తెలుస్తోంది.
గతంలో 35 వార్డులుగా ఉన్న తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 5 సమీప గ్రామాలను (కొండ్రుపోలు, ఎల్.అగ్రహారం, కుంచనపల్లి, ప్రత్తిపాడు, పడాల) విలీనం చేస్తూ వార్డుల సంఖ్యను 40కి పెంచేందుకు ప్రతిపాదించారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసుల వల్ల గత ఏడేళ్లుగా ఇక్కడ ఎన్నికలు జరగక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అలాగే ప్రతిపాదిత ఐదు గ్రామాలకు కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించలేదు. ఇదిలా ఉండగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో కోర్టు కేసులున్న 23 మున్సిపాలిటీలు మినహా మిగిలిన వంద మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొంది.
గవర్నర్ ఆర్డినెన్స్ మాటేంటి?
మున్సిపాలిటీల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనలకు సంబంధించి 2021 జనవరి 12న అప్పటి గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు. దీని ప్రకారం ప్రతిపాదిత పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసుకోవచ్చని చెబుతున్నారు. వీటిని సవాల్ చేస్తూ కేసులు వేసిన వారు కోర్టును ఆశ్రయించినా గతంలో వాటిని కొట్టేసినట్టు సమాచారం.
1న వాదనలు : తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఐదు గ్రామాల విలీనానికి సంబంధించి వచ్చేనెల 1న హైకోర్టులో వాదనలు జరుగనున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గతంలో ఈ కేసులను కోర్టులో దాఖలు చేసిన న్యాయవాది ప్రభుత్వ నియామక పోస్టులోకి వెళ్లడంతో ఆయన నుంచి కేసులను కేసులు వేసిన వారు వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి అప్పట్లో కేసులు వేసిన వారు టీడీపీ సానుభూతిపరులుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ ఇక్కడ ఎన్నికలు జరగాలని ఆకాంక్షిస్తోంది.
కూటమి వ్యూహం.. ‘చిదంబర’ రహస్యం
తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికల విషయంలో కూటమి వ్యూహం చిదంబర రహస్యంగా ఉంది. ఈ ఎన్నికను రెండేళ్ల కూటమి పాలనకు రిఫరెండంగా భావిస్తున్నట్టు ఆయా నాయకుల ఆలోచనలు కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో పరాభవం తప్పదనే భయం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కూటమిలో కీలక నాయకుడు ఒకరు జిల్లాలోని తీరప్రాంతానికి చెందిన పేరొందిన హైకోర్టు లాయర్ ద్వారా తాడేపల్లిగూడెం ఎన్నిక నిలుపుదలకు కేసు వేయించినట్టు సమాచారం.


