166 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన
ఈ నెల 27 వరకు దరఖాస్తు గడువు
తొలిసారి డీఈవో ఉద్యోగాలకు డైరెక్ట్ చాన్స్
ఎస్సీ వర్గీకరణతో రోస్టర్ మార్పులు
ఓటీపీఆర్ చిక్కులు.. డిజిటల్ మూల్యాంకన సందేహాలు
గ్రూప్–1 అభ్యర్థులకు కొత్త అగ్నిపరీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 166 గ్రూప్–1 సర్వీసు పోస్టులతో పాటు ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో 40 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్స్, ఉద్యాన శాఖలో 37 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. అభ్యర్థులు ఈ నెల 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 24న ఆఫ్‌లైన్ (ఓఎంఆర్) పద్ధతిలో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఓటీపీఆర్ అప్‌డేట్‌కు అవకాశం కల్పించిన సర్వీస్ కమిషన్.. తాజా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
తొలిసారి డీఈవో పోస్టుల భర్తీ
పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే మొదటిసారిగా 14 జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పోస్టులను తాజా గ్రూప్–1 ద్వారా నేరుగా భర్తీ చేస్తున్నారు. గతంలో డీఈవో పోస్టులను కేవలం డిప్యూటీ డీఈవో లేదా సమాన కేడర్ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతి కల్పించి నియమించేవారు. తాజాగా సర్వీస్ నిబంధనలను సవరించి మొత్తం డీఈవో పోస్టుల్లో 50% గ్రూప్–1 ద్వారా నేరుగా, మిగిలిన 50% పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు.
95 శాతం లోకల్ రిజర్వేషన్.. డిజిటల్ మూల్యాంకనం
రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 అమలులో భాగంగా లోకల్ రిజర్వేషన్ విధానాన్ని ఈ నోటిఫికేషన్ నుంచే అమల్లోకి తెచ్చారు. ఇందులో భాగంగా 95% పోస్టులను స్థానిక (లోకల్) అభ్యర్థులకు, కేవలం 5% పోస్టులను మాత్రమే ఓపెన్ (నాన్–లోకల్/ఓపెన్ కాంపిటీషన్) కోటా కింద కేటాయించారు. గతంలో ఉన్న మహిళల వర్టికల్ రిజర్వేషన్ విధానంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో తాజాగా 33 1/3 శాతం రిజర్వేషన్‌ను ఎలాంటి రోస్టర్ పాయింట్లు లేకుండా సమాంతరంగా (హారిజాంటల్ ఇంటర్ లాకింగ్) అమలు చేయనున్నారు. క్రీడాకారులకు 3 శాతం కోటాను వర్తింపజేశారు. సుప్రీంకోర్టు తీర్పు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3గా విభజిస్తూ తొలిసారి రోస్టర్ పాయింట్లతో ఖాళీలను కేటాయించారు. సంప్రదాయ పద్ధతితో పాటు డిజిటల్ ఎవాల్యుయేషన్ విధానాన్ని పరిశీలించే నిబంధనను పొందుపరిచారు.
స్థానికతపై ఆందోళన
తాజా నోటిఫికేషన్‌లో స్థానికత నిర్ధారణకు పాఠశాల విద్యను ప్రాతిపదికగా తీసుకున్నారు. మొదటి నిబంధన ప్రకారం 7వ తరగతితో కలిపి అంతకుముందు వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే స్థానికత. మొదటి నిబంధన వర్తించకపోతే, 1 నుంచి 7 తరగతుల మధ్య ఎక్కువ కాలం ఎక్కడ చదివితే ఆ ప్రాంతం పరిగణనలోకి వస్తుంది. సమాన కాలమైతే చివరిగా చదివిన ప్రాంతం వర్తిస్తుంది.
రెగ్యులర్ స్కూలింగ్ లేనివారు నివసించిన ప్రాంతం ఆధారంగా, నేరుగా ఓపెన్ ద్వారా డిగ్రీ చేసినవారు రెసిడెన్స్ సరి్టఫికెట్ ఆధారంగా స్థానికులుగా అర్హులు. కమిషన్ ఆదేశాల మేరకు అభ్యర్థులు వన్–టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) వివరాలు అప్‌డేట్ చేస్తుండగా.. వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా 1వ తరగతి వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. దీంతో 7వ తరగతి వరకు బడికి వెళ్లకుండా నేరుగా ఓపెన్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు ఓటీపీఆర్ అప్‌డేట్ కాక ఆందోళన చెందుతున్నారు.
వివిధ విభాగాలలో పోస్టుల ఖాళీలు ఇలా..
గ్రూప్–1 సర్వీసెస్‌లో 166, ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులు 41, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు 37, ఏపీ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఇంజనీరింగ్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 8 ఉన్నాయి. పూర్తి వివరాలకు సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov. in లో చూడవచ్చు.


