టాప్‌ టూలో.. చినవెంకన్న! | - | Sakshi
Sakshi News home page

టాప్‌ టూలో.. చినవెంకన్న!

Oct 7 2026 2:04 AM | Updated on Oct 7 2026 2:04 AM

ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సేవలపై కంప్యూటర్‌ సహాయంతో ఫోన్‌ ద్వారా నిర్వహించిన అభిప్రాయ సేకరణ(సీఏటీఐ) సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం మరోసారి మెరుగైన స్థానాన్ని సాధించింది. అక్టోబర్‌ నెలకు సంబంధించిన సర్వేలో 71.9 శాతం పాజిటివ్‌ స్కోర్‌తో రెండో ర్యాంకులో నిలిచింది. 72.4 శాతంతో విజయవాడ మొదటి స్థానంలో ఉండగా.. 68.1 శాతంతో సింహాచలం మూడో స్థానంలో నిలిచింది. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ ఈనెల 5న విడుదల చేసిన ‘పబ్లిక్‌ పాజిటివ్‌ పర్సెప్షన్‌’ నివేదికలో వెల్లడించింది.

నాలుగు అంశాలపై అభిప్రాయ సేకరణ

భక్తులకు దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రతి నెలా సీఏటీఐ విధానంలో ఫోన్‌ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. దర్శనం, తాగునీటి వసతులు, ప్రసాదం రుచి–నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ అనే నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుని అభిప్రాయాలను నమోదు చేస్తున్నారు. గత నెల 4వ తేదీ నుంచి ఈ నెల 4 వరకు నమోదైన స్పందనల ఆధారంగా తాజా ర్యాంకులను వెల్లడించారు.

50,800 మందికి ఫోన్‌.. 582 స్పందనలు

దేవాలయ సౌకర్యాలపై నిర్వహించిన సీఏటీఐ సర్వేలో మొత్తం 50,800 ఫోన్‌ నంబర్లను సంప్రదించారు. వీరిలో 398 మంది పాజిటివ్‌గా, 184 మంది నెగెటివ్‌గా స్పందించారు. మొత్తంగా 582 మంది స్పందించగా.. స్పందన రేటు 1.15 శాతంగా నమోదైంది. ఈ అభిప్రాయాల ఆధారంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తుల సంతృప్తి స్థాయిని అంచనా వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా దర్శనానికి 72.3 శాతం సంతృప్తి

రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై నిర్వహించిన ఈ సర్వేలో ఓవరాల్‌గా దర్శన సంతృప్తి 72.3 శాతంగా నమోదైంది. ప్రసాదం రుచి, నాణ్యతకు 74.2 శాతం, పరిశుభ్రతకు 63.3 శాతం, తాగునీటి సౌకర్యాలకు 63.2 శాతం పాజిటివ్‌ స్పందనలు లభించాయి. మొత్తంగా దేవాలయ సౌకర్యాలపై పాజిటివ్‌ స్కోర్‌ 68.2 శాతంగా నమోదైంది.

స్వల్పంగా తగ్గినా.. రెండో స్థానమే

సెప్టెంబర్‌లో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం 72.1 శాతం సంతృప్తి రేటింగ్‌తో ఉండగా.. అక్టోబర్‌లో 71.9 శాతానికి చేరింది. అంటే 0.2 శాతం పాయింట్ల స్వల్ప తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.

సింహాచలంలో పెరుగుదల.. కాణిపాకంలో తగ్గుదల

అక్టోబర్‌ ర్యాంకింగ్స్‌లో విజయవాడ 72.4 శాతంతో మొదటి, ద్వారకాతిరుమల 71.9 శాతంతో రెండు, సింహాచలం 68.1 శాతంతో మూడు, అన్నవరం 66.6 శాతంతో నాలుగో స్థానాల్లో నిలిచాయి. శ్రీకాళహస్తి, శ్రీశైలం చెరో 65.8 శాతంతో ఐదో స్థానాన్ని పంచుకోగా.. కాణిపాకం 65.7 శాతంతో ఆరో స్థానంలో ఉంది. సెప్టెంబర్‌తో పోలిస్తే సింహాచలం 66.3 నుంచి 68.1 శాతానికి పెరగగా.. శ్రీశైలం 65.5 నుంచి 65.8కి, అన్నవరం 66.5 నుంచి 66.6 శాతానికి స్వల్పంగా మెరుగుపడ్డాయి. మరోవైపు విజయవాడ 74.3 నుంచి 72.4 శాతానికి తగ్గగా.. శ్రీకాళహస్తి, కాణిపాకంలోనూ తగ్గుదల నమోదైంది.

సీఏటీఐ సర్వేలో ద్వారకాతిరుమలకు రెండో ర్యాంకు

అక్టోబర్‌లో 71.9 శాతం పాజిటివ్‌ స్కోర్‌

72.4 శాతంతో తొలి స్థానంలో విజయవాడ

దర్శనం, తాగునీరు, ప్రసాదం, పారిశుద్ధ్యంపై భక్తుల అభిప్రాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement