గణపవరం (నిడమర్రు): సేవా సంకల్ప ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో నిడమర్రు మండలానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ప్రథమ స్థానంలో కోటి చంద్రిక
పెదనిండ్రకొలను జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కోటి చంద్రిక ఈ నెల 1న ఏలూరులో నిర్వహించిన పోటీల్లో జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం దక్కించుకుంది. 25 కోట్ల మంది విద్యార్థుల డ్రీమ్ ఇండియా’ అనే అంశంపై ఆమె ఈ చిత్రలేఖనం రూపొందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యేంద్రకుమార్ రెడ్డి తెలిపారు. ఈ విద్యార్థినికి శిక్షణ అందించిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కె.సుబ్బరాజును, చంద్రికను హెచ్‌ఎంతో పాటు ఎస్‌ఎంసీ చైర్మన్ ఎల్.బాలాజీ, ఎంఈవోలు తైలం అనూరాధ, యర్రంశెట్టి శేషగిరిరావు అభినందించారు.
చొక్కాకుల దీవెనకు ద్వితీయ స్థానం
నిడమర్రు మండలం పత్తేపురం జెడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని చొక్కాకుల దీవెన సీనియర్స్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొట్టాపు మల్లికార్జునరావు తెలిపారు. ఆమె కూడా 25 కోట్ల విద్యార్థుల డ్రీమ్ ప్రాజెక్ట్ అనే అంశంపై చిత్రలేఖనంలో ఈ ప్రతిభ కనబరిచారు. దీవెనను హెచ్‌ఎం మల్లికార్జునరావు, ఎస్‌ఎంసీ చైర్మన్ కడియం బేబీలక్ష్మీ ప్రసన్న, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పత్సమట్ల లక్ష్మీపతిరాజు, రుద్రరాజు కొండయ్యరాజు, పొత్తూరి నర్సింహరాజు తదితరులు అభినందించారు.


