భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి డ్రెయిన్‌లోకి దూసుకెళ్లింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యురాలు తెల్లవారుజామున తన ఆసుపత్రికి అత్యవసర (అర్జెంట్) కేసు నిమిత్తం వెళ్లి, తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భీమవరం మండలం చినఅమిరం గ్రామం వద్ద ఆమె నడుపుతున్న కారు అదుపుతప్పి డ్రెయిన్‌లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
భీమవరం: పట్టణంలోని ఓ ఆసుపత్రి వద్ద పార్కింగ్ చేసిన కారు కనిపించడం లేదంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్సై రామరావు మంగళవారం తెలిపారు. కాళ్ల మండలం పెదఅమిరం గ్రామానికి చెందిన కటికతల జార్జ్ ఈ నెల 3న భీమవరం వచ్చి, వర్మ ఆసుపత్రి వద్ద తన కారును పార్కింగ్ చేసి వేరే పనిపై బయటకు వెళ్లారు. తిరిగి 4వ తేదీన వచ్చి చూసేసరికి కారు కనిపించలేదు. చుట్టుపక్కల పరిసరాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు వెల్లడించారు.
నూజివీడు: మండలంలోని తక్కులూరులోని క్వారీలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు మైనింగ్ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి మంగళవారం క్వారీని సందర్శించారు. ఆ సమయంలో క్వారీలో ఉన్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఎంతమేరకు అక్రమ మైనింగ్ చేశారనే విషయాలను నిర్ధారించుకొని తదుపరి ట్రాక్టర్లకు జరిమానా విధిస్తారని తహసీల్దార్ షంషుద్ధీన్ పేర్కొన్నారు. ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని పీజీఆర్‌ఎస్‌లో గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్‌ను నియంత్రించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారిని మంగళవారం పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించడంతో పాటు, భక్తులు తమ పిల్లలకు అన్నప్రాసనలు, నూతన వాహనాలకు పూజలను ఆలయ అర్చకుల ద్వారా జరిపించుకున్నారు. వివిధ సేవల రూపంలో దేవస్థానానికి రూ.2,57,468 ఆదాయం సమకూరినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు. సుమారు 2,834 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేసినట్లు వారు వెల్లడించారు.
ఉంగుటూరు: జాతీయ రహదారిపై నాచుగుంట వద్ద చిన్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న కారు నాచుగుంట వద్దకు వచ్చేసరికి, వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములను చూసి డ్రైవర్ కంగారు పడ్డాడు. దీంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువ గట్టు వైపు తిరగబడింది. ఈ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.


