నరసాపురం రూరల్: మొగల్తూరులో సంచలనం సృష్టించిన వడ్డీ వ్యాపారి గ్రంధి బాబి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ సుధాకర్ మంగళవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. వడ్డీ వ్యాపారి బాబి వద్దకు తాకట్టు కోసం వచ్చిన మామిడిశెట్టి కల్యాణ్ కుమార్.. బాబీ ఒంటరిగా ఉండటంతో హత్య చేస్తే లక్షల రూపాయలు వస్తాయని పథకం వేశాడు. ఇందులో భాగంగా తన స్నేహితులు మోక లక్ష్మీ వరప్రసాద్, చింతలపూడి సతీష్, దొంగ సాయి గణేష్‌తో కలిసి ఈ ఏడాది జూన్ 16న బాబీని హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తొలుత ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ, మృతుడి కుమారుడు పవన్ వ్యక్తం చేసిన అనుమానాలతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరో కేసు విచారణలో భాగంగా ఈ హత్యోదంతం వెలుగులోకి రావడంతో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారినుంచి 8 కేజీల వెండి, రూ. 20 వేల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే తాకట్టు పెట్టిన 450 గ్రాముల బంగారాన్ని కార్పొరేట్ సంస్థల నుంచి త్వరలోనే స్వాధీనం చేసుకుంటామన్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


