పెచ్చుమీరుతున్న మోసాలు.. బాధితుల గగ్గోలు | - | Sakshi
Sakshi News home page

పెచ్చుమీరుతున్న మోసాలు.. బాధితుల గగ్గోలు

Oct 7 2026 2:04 AM | Updated on Oct 7 2026 2:04 AM

భీమవరం(ప్రకాశం చౌక్‌): జిల్లాలో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్యుల దగ్గరి నుంచి చదువుకున్నవారు, చివరికి తెలివైన వారు సైతం పలు రకాల మోసాల బారిన పడుతున్నారు. చీటీలు, రియల్‌ ఎస్టేట్‌, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జరిగే మోసాలు, గల్ఫ్‌ మోసాలు, డ్వాక్రా సొమ్ముల స్వాహా వంటి దారుణాలతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. అధికారులు, పోలీసులు ఎంతగా అప్రమత్తం చేస్తున్నప్పటికీ ప్రజలు నిత్యం మోసపోతూనే ఉన్నారు. బాధితులు పోలీసు అధికారులను ఆశ్రయించినా సరైన న్యాయం జరగడం లేదంటూ చివరికి కలెక్టర్‌ను ఆశ్రయిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌కు చీటింగ్‌ కేసులకు సంబంధించి 5 నుంచి 6 మంది బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు.

చీటీల వ్యాపారాల మోసాలు

జిల్లాలో చీటీల వ్యాపారాల పేరుతో మోసాలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ఉద్యోగులు, వ్యాపారవేత్తల వరకు నెలనెలా క్రమం తప్పకుండా చీటీలు కడుతున్నారు. అయితే, చివరకు వ్యాపారులు ప్రజల డబ్బు చెల్లించకుండా పరారవుతున్నారు. లక్షల్లో కాకుండా కోట్లాది రూపాయల చీటీ డబ్బుతో కొందరు జంప్‌ అవుతున్నారు. ఇటీవల తణుకులో ఓ ఫైనాన్స్‌ వ్యాపారి కోట్ల రూపాయల చీటీ సొమ్ముతో పరారు కాగా, తాజాగా భీమవరం మండలంలోనూ రూ.కోట్లలో చీటీ డబ్బు మోసం జరిగిందంటూ బాధితులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కొందరు వ్యాపారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులపాలు చేసి, అప్పుల ఊబిలోకి నెట్టి చివరికి ఆత్మహత్యల వరకు తీసుకువెళ్తున్నారు.

ఉద్యోగాలు, గల్ఫ్‌ మోసాలు

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు కోకొల్లలు. కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి కొందరు లక్షల రూపాయలు గుంజుతున్నారు. అలాగే గల్ఫ్‌ దేశాలకు పంపిస్తామంటూ ఏజెంట్లు ముందుగా డబ్బులు, పాస్‌పోర్టులు తీసుకుని మోసం చేస్తున్నారు. మరికొందరు అక్కడికి వెళ్లిన తర్వాత కష్టమైన పనుల్లో పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

రియల్‌ ఎస్టేట్‌, మహిళల మోసాలు

ప్లాట్ల కొనుగోలు: జిల్లాలో కొందరు రియల్టర్లు అక్రమ లేఅవుట్లు వేసి, దారులు లేకపోయినా ఉన్నాయని నమ్మించి అమాయకులను మోసం చేస్తున్నారు. నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం బాధితులు ఇటీవల కలెక్టర్‌ను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

డ్వాక్రా మోసాలు: గతంలో కొందరు మహిళలు చీటీలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడగా, ఇటీవల కొందరు డ్వాక్రా ఆర్‌పీలు, వీఏఓలు, గ్రూప్‌ లీడర్లు తోటి మహిళల బ్యాంకు రుణాల సొమ్మును స్వాహా చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.

ఫేక్‌ రిజిస్ట్రేషన్లు: సబ్‌–ఇన్‌స్పెక్టర్లు లేదా రిజిస్ట్రార్ల అవినీతి కారణంగా కొడుకులు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఆస్తులు రాయించుకోవడం, హక్కుదారుల ప్రమేయం లేకుండా ఫేక్‌ రిజిస్ట్రేషన్లు చేయడం వంటి మోసాలు జరుగుతున్నాయి.

అప్రమత్తతే శ్రీరామరక్ష

ప్రజలు అప్రమత్తంగా ఉండటమే ఏకై క రక్షణ. ఉద్యోగాలు, గల్ఫ్‌ ప్రయాణాల పట్ల యువత అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రిజిస్టర్డ్‌ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలి. చీటీలు వేసే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించాలి. రియల్‌ ఎస్టేట్‌లో స్థలాలు కొనేప్పుడు అన్ని నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి. డ్వాక్రా మహిళలు వాయిదాలు చెల్లించేటప్పుడు పొదుపు, లోను పుస్తకాలను సరిచూసుకోవాలి తప్ప ఇతరుల చేతికి నేరుగా నగదు ఇవ్వకూడదు.

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement