
తాడేపల్లి : ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇంటింటికి వెళ్లలేక టిడిపి, జనసేన నేతలు ముఖం చాటేస్తున్నారని, ఇప్పటికే కూటమీ ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘోరంగా విఫలమైందన్నారు. ఈరోజు(ఆదివారం, జూలై 06) వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
దీనికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘రీకాల్ చంద్రబాబూ మేనిఫెస్టో' కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. దీన్ని మరింతగా గ్రౌండ్ లెవెల్‌కు తీసుకువెళ్లాలి. 13 నుంచి 20వ తేదీ వరకు మండలాల స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలి.
21 నుంచి ఆగస్టు 4 వరకు గ్రామీణ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలి. చంద్రబాబు సహా కూటమి నేతలు చేసిన మోసాలపై మనం గట్టిగా జనంలోకి వెళ్లాలి. రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమానికి జిల్లాల స్థాయిలో మంచి స్పందన వచ్చింది. దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లడాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని సజ్జల సూచించారు.