
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ శనివారం పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని మండిపడ్డారు. విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి స్టేషన్‌కు తరలించారని.. ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని.. వైద్యులను టెస్టులు రాయకుండా అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు.
‘‘వంశీని బలి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మాజీ మంత్రి అచ్చెన్నను అరెస్టు చేస్తే పైల్స్ అంటూ డ్రామాలు ఆడారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కాపాడుకున్నారు. వంశీకి ఊపిరితిత్తులలో ఇబ్బందులు ఉన్నా కానీ.. చికిత్స అందించడం లేదు. చెంచాగిరి చేస్తున్న ఉద్యోగులందరినీ చట్టం ముందు నిలబెడతాం. సీఐ భాస్కర్ రావు అయిన, ప్రభుత్వం ఆసుపత్రి సూపరిండెంట్ అయిన ఎవరిని వదిలిపెట్టం’’ అంటూ పేర్ని నాని హెచ్చరించారు.
న్యాయ పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం.. వంశీ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. బెయిల్ రాగానే కేసుల మీద కేసులు పెడుతున్నారు. మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. న్యాయ పోరాటం చేస్తాం. అక్రమ కేసుల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొని వెళ్తాం. నిలబడలేని మాట్లాడలేని స్థితిలో ఉన్న వంశీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వంశీని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
