తప్పుడు కేసులు నాకేమీ కొత్త కాదు.. కూటమి టార్గెట్‌ అదే: మిథున్‌ రెడ్డి | YSRCP MP Mithun Reddy Serious Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

తప్పుడు కేసులు నాకేమీ కొత్త కాదు.. కూటమి టార్గెట్‌ అదే: మిథున్‌ రెడ్డి

Jul 19 2025 9:11 AM | Updated on Jul 19 2025 10:48 AM

YSRCP MP Mithun Reddy Serious Comments On CBN Govt

సాక్షి, ఢిల్లీ: ఏపీలో మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.. రాజకీయ ఒత్తిడితోనే తనపై కేసు పెట్టారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి తెలిపారు. మద్యం కేసులో తన పాత్రపై ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీలో ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టడమే టార్గెట్‌గా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో సిట్‌ విచారణకు తాను హాజరు అవుతున్నట్టు మిథున్‌ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలోనే మిథున్‌ రెడ్డి ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ..‘ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కేసులో ఎలాంటి సీజర్లు లేవు, సాక్ష్యాలు లేవు. కేసులకు భయపడే ప్రసక్తి లేదు. భయపడే వ్యక్తిని అయితే రాజకీయాల్లోనే ఉండను. వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ కేసుల నుంచి బయటపడతాను. నా పాత్రపై ఆధారాలు ఉంటే చూపించండి. నా ఫోన్లు మీకు ఇస్తా.. దర్యాప్తునకు సహకరిస్తాను. సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు పెట్టారు. ముందుగానే ఒక వ్యక్తిని జైల్లో వేయాలని నిర్ణయించుకుని.. ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లుతున్నారు.  

మద్యం కేసు టార్గెట్‌ కాదు..
తమకు అనుకూలంగా ఉన్న వారిని నయానో.. భయానో ఒప్పించి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. ఈ కేసులో  ఎలాంటి సీజర్లు లేవు, సాక్ష్యాలు లేవు. నోటి మాటలతో ఇచ్చిన స్టేట్మెంట్లు ఇప్పించి కేసు నడుపుతున్నారు. ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టడమే టార్గెట్ గా కేసులు పెడుతున్నారు. మద్యం కేసు వారి టార్గెట్ కాదు. తమకు నచ్చని వారిని వేధించేందుకు రకరకాల కథలు అల్లుతున్నారు.. ఇదేమి కొత్తది కాదు. 2014-19 లోను నాపై తప్పుడు కేసులు పెట్టారు. నేనేదో దాడి చేశానని నాడు టీడీపీ హయాంలో  కేసు పెట్టారు. నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా వినకుండా జైల్లో పెట్టారు. అప్పుడు తప్పుడు సాక్షాలు చెప్పిన వారంతా.. మళ్లీ కోర్టుకు వచ్చి అదంతా తప్పు అని చెప్పారు. దాంతో కోర్టు ఆ కేసును కొట్టివేసింది. మళ్లీ అదే తరహాలో ఇప్పుడు అరెస్టు చేస్తున్నారు. వీటన్నిటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను

ఎవరినైనా అరెస్టు చేయాలనుకుంటే ముందుగా ఎల్లో మీడియాలో.. మాస్టర్ మైండ్ అని కట్టుకథలు అల్లుతున్నారు. గతంలో ఇతరులను మాస్టర్ మైండ్ అన్నారు.. ఇప్పుడు నన్ను మాస్టర్ మైండ్ అంటున్నారు.. రేపు  ఇంకొకరిని పట్టుకొచ్చి అతన్ని మాస్టర్ మైండ్ అంటారు. ఏదో రకంగా మాపై బురద జల్లాలని  చూస్తున్నారు. కొద్దిమంది అధికారులను తీసుకొచ్చి భయపెట్టి.. ఒప్పుకోకపోతే జైల్లో పెడతామని స్టేట్మెంట్లు తీసుకున్నారు. మేము ఎక్కడ కలిశామో ఆధారాలు చూపండి. నోటి మాటతో కేసు పెడతారా?. అధికారులను బెదిరించి మాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు తీసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇదే అధికారులను బెదిరించి చెప్పించారని కోర్టులో చెబుతారు.. కేసు కొట్టివేస్తారు. గతంలో కూడా ఇలాగే నాపై తప్పుడు కేసు పెడితే కోర్టు కొట్టేసింది. ఈ కేసులో రేపు జరగబోయేది కూడా ఇదే.  

నోటి మాటలతో కథలు.. 
మద్యం కేసులో మొదట్లో 50వేల కోట్లు అన్నారు. ఆ తర్వాత 30,000 కోట్లు.. అటు తర్వాత 3000 కోట్లు అని అంటున్నారు. 3000 కోట్లు ఎక్కడ అంటే.. ఎలక్షన్‌లో ఖర్చు పెట్టారని చెబుతున్నారు. సిట్ చెప్పే కట్టు కథలు నమ్మదగినవి కాదు. ఎక్కడైనా డబ్బును సీజ్ చేశారా?. పెట్టుబడులు  పెట్టారా?. ఇవన్నీ లేకుండా కేవలం నోటి మాటతో కథలు చెబుతున్నారు. అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలని లక్ష్యంతోనే ఈ కేసులు పెట్టారు.. ఈ కేసు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఒక ఎంపీగా నా పాత్ర పార్లమెంటు నియోజకవర్గం వరకే పరిమితం. మద్యం విధానాల్లో నేను జోక్యం చేసుకోలేదు. పార్లమెంటులో చట్టాల రూపకల్పనలో చర్చల్లో పాల్గొనడమే మా పని. మరెక్కడ కూడా నేను జోక్యం చేసుకోలేదు.  కేవలం కక్ష సాధింపులో భాగంగానే కేసులు బనాయించారు. ఈ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నింటికీ మేము రెడీగా ఉన్నాం. తప్పు చేయనంతవరకు భయపడాల్సిన పనిలేదు’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement