అందుకే పెద్దిరెడ్డి పేరును చంద్రబాబు రోజూ తలుచుకుంటున్నారు: మిథున్‌ రెడ్డి | YSRCP MP Midhun Reddy Serios Comments On CM Chandrababu | Sakshi
Sakshi News home page

అందుకే పెద్దిరెడ్డి పేరును చంద్రబాబు రోజూ తలుచుకుంటున్నారు: మిథున్‌ రెడ్డి

Jan 30 2025 3:57 PM | Updated on Jan 30 2025 4:25 PM

YSRCP MP Midhun Reddy Serios Comments On CM Chandrababu

సాక్షి, ఢిల్లీ:  రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్షనేత మిథన్‌ రెడ్డి. అలాగే, చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.

అనంతరం, మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్స్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. పుంగనూరులో మేము కొనుగోలు చేసిన భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి పేరును ఆయన రోజూ తలుచుకుంటున్నారు. ఏదో ఒక రకంగా కక్ష సాధించాలని చూస్తున్నారు. 2001లోనే మేము భూములను కొనుగోలు చేశాం. అది ప్రభుత్వ భూమి కాదని 1968లోనే గెజిట్ విడుదల చేసింది. అది ప్రైవేట్ ల్యాండ్ అని రికార్డ్స్ చెపుతున్నాయి. ఆ భూమి ఎకర విలువ నాలుగు లక్షల రూపాయలు మాత్రమే. మొత్తం భూమి విలువ మూడు కోట్లు మాత్రమే ఉంటుంది. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం. 

రాజకీయ కక్షతోనే మాపైన కేసులు పెడుతున్నారు. పై కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి లేదు. చంద్రబాబు కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నారు. గతంలో మదనపల్లి ఫైల్స్ తగలబెట్టారని మాపైన ఆరోపణలు చేశారు. రకరకాల కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాకు డిస్టిలర్‌లో భాగం ఉందన్న ఆరోపణలు రుజువు చేయాలి. మాపై ఇప్పటి వరకు ఆరోపణలను రుజువు చేయలేకపోయారు. చంద్రబాబు ఆరోపణలు రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలి. కూటమి కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

వైఎస్‌ జగన్‌కు విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితులు. ఆయన పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. విజయసాయిరెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. ఎంపీలు ఎవరూ వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వెళ్లరు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టిపారేశారు. 

ఇదే సమయంలో పోలవరం ఎత్తుపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలి. పోలవరం ఎత్తు తగ్గిస్తారన్న అంశంపై మంత్రి నేరుగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలాగే,  మార్గదర్శి చిట్ ఫండ్స్ కుంభకోణం సహారా కుంభకోణాన్ని మించింది. మార్గదర్శి  నిబంధనలను ఉల్లంఘించిందని సుప్రీంకోర్టుకు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.  వేలాది మంది డిపాజిటర్లు మార్గదర్శి వల్ల  నష్టపోయారు. నేను పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని లేఖలు రాస్తాను. న్యాయస్థానంలో కూడా కేసులు వేస్తాను అని చెప్పారు. 

ఇదిలా ఉండగా.. పెద్దిరెడ్డి, చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఓ సందర్భంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం చంద్రబాబు ఇద్దరూ క్లాస్‌మేట్స్‌ అని చెప్పారు. అప్పట్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని అన్నారు. అందుకే చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే అంత కోపమని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పటికీ పెద్దిరెడ్డిపై కక్షతో రగిలిపోతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని నాశనం చేసి, ఆయనపై పగ తీర్చుకోవాలని చూస్తున్నారని అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement