
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు మహిళలకు అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పదేపదే మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు పెద్ద చీటర్ అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హామీల అమలు చేయకుండా మహిళా లోకాన్ని వంచిస్తున్న సీఎం చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.
మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రి అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు. ఇదేనా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
ఎన్నికల్లో హామీలతో ఊదరగొట్టారు:
కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో.. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని హామీ ఇస్తూ మేనిఫెస్టోలో పెట్టారు. 2 కోట్ల మంది మహిళలకు ఈ పథకం కింద హామీ ఇచ్చారు. ఈ పథకం అమలుకు నెలకు రూ.3 వేల కోట్లు చొప్పున ఏడాదికి రూ.37వేల కోట్లు అవసరం. ఇప్పటికే గతేడాది ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎగరగొట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రెండో ఏడాదిలోకి ప్రవేశించింది.
ఈ రెండేళ్లకు కలిపి రూ.75 వేల కోట్లు ఎగ్గొట్టింది. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆడ బిడ్డలు కష్టాల్లో ఉన్నారు వారి కష్టాన్ని తీర్చడానికి ఈ పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. కూటమి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే ఇంటింటికీ బాండు పేపర్లు కూడా ఇచ్చారు. గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చారు. ఇప్పటి మంత్రి రామానాయుడు అయితే నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అంటూ ఇంటింటికీ వెళ్లి మభ్యపెట్టిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలి అన్న విషయం ఆ రోజు మీకు ఎందుకు గుర్తులేదు.
అచ్చెన్నాయుడు మాటలు మోసానికి పరాకాష్ట:
మంత్రి లోకేష్ కూడా తన యువగళం పాదయాత్రలో కూడా ఈ హామీలిచ్చారు. ఇక చంద్రబాబు అయితే పదే పదే ప్రతి సభలోనూ.. ప్రతి ఆడబిడ్డకు రూ.1500 ఇస్తాను దాన్ని రూ.15వేలు చేసే మార్గం చెబుతానని ప్రచారం చేశారు. ఇప్పుడేమో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడం కోసం ఆంధ్రానే అమ్మాలన్న ఆలోచన చేస్తున్నారని సాక్షాత్తూ మంత్రి అచ్చన్నాయుడు చెబుతున్నాడు. ఈ వ్యాఖ్యలు మోసానికి పరాకాష్ట.
గతేడాది, ఈ ఏడాది రెండూ కలిపి ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు ఇస్తారని ఎదురుచూస్తున్న మహిళలకు.. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి. ఇది కేవలం అచ్చన్నాయుడు వ్యాఖ్యలు మాత్రమే కాదు.. చంద్రబాబు మాట కూడా ఇదే. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మాట్లాడుతూ... సూపర్ సిక్స్ హామీలన్నింటినీ అమలు చేసేశాం. ఎవరైనా కాదు అంటే వాళ్ల నాలుక మందం అని మాట్లాడుతున్నారు.
ఒక్క పథకమైనా అమలు చేశారా?
అన్ని పథకాలు అమలు చేశామని చెబుతున్న చంద్రబాబుకి ఆయన కేబినెట్ మంత్రులని సూటిగా అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిరుద్యోగికి అయినా మీరు నిరుద్యోగభృతి ఇచ్చారా.? ఒక్క నిరుద్యోగికి అయినా ఒక్క ఉద్యోగం ఇచ్చారా.? ఒక్క మహిళకైనా ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇచ్చారా.? ఒక్క మహిళకైనా గత ఏడాది కాలంలో 3 సిలిండర్లు ఫుల్ గా ఇచ్చారా.?
ఒక్క మహిళకైనా ఇళ్లు ఇచ్చారా ఇళ్ల స్థలం ఇచ్చారా, సున్నా వడ్డీ ఇచ్చారా.? ఒక్క ఉద్యోగికైనా సున్నా వడ్డీ ఇచ్చారా ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చారా.? ఒక్క రైతుకైనా రైతుభరోసా ఇచ్చారా.? ఇవేవీ ఇవ్వకుండా అన్నీ ఇచ్చేశామని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు నిట్టనిలువునా మోసపోయారు.
ఏడాదిలో చేసిన రూ.1.86 లక్షల కోట్ల అప్పు ఏమైంది.?
వైఎస్ జగన్ హయాంలో అన్ని పథకాలను చక్కగా అమలు చేశారు. నవరత్నాలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపునేస్తం వంటి పథకాలు ఇస్తే... ఇదే కూటమి నేతలు ఆ రోజు ఈ పథకాలన్నీ ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని తప్పుడు ప్రచారం చేశారు. మరలా ఎన్నికల టైం వచ్చేసరికి ప్రజలను మభ్యపెట్టడానికి అవే పథకాలకు పేర్లు మార్చి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పారు.
ఈ రోజు మీరు చెప్పిన పథకాలేవీ అమలు చేయకుండా.. వాటిని అమలు చేయడానికి రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పడం ఎంతవరకు సమంజసం.? ఆడబిడ్డ నిధి పథకానికి ఏడాదికి రూ.37వేలు కోట్లు కావాలి. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.86 లక్షల కోట్లు. అందులో రూ.37 వేల కోట్లు ఆడబిడ్డ నిధి పథకానికి ఎందుకు ఖర్చు చేయలేదు. మీరు అప్పు చేసిన డబ్బులు ఎటువైపు వెళ్తున్నాయి.
గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.3.30 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే అందులో సగం కంటే ఎక్కువ అప్పు చేశారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన అప్పులో రూ.2.75 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా ప్రజల అకౌంట్లలోకి నేరుగా డీబీటీ చేస్తే... మీరు ఏ హామీని అమలు చేయకుండా ప్రజలు మోసం చేసి.. ఈ పథకాలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలని చెబుతున్నారు. మీరు చేస్తున్న మోసాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు.
హామీల అమలులో చిత్తశుద్ధి లేదు:
కూటమి పార్టీలకు ప్రజలకిచ్చిన హామీల అమలు మీద చిత్తశుద్ధి లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం హామీలిచ్చారే తప్ప వాటిని అమలు చేయాలన్న ఆలోచన లేదు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ద్వారా చంద్రబాబు విజనరీ కాదు విశ్వాస ఘాతకుడు అన్న విషయం ప్రజలకు అర్థమైంది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేంతవరకు ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తుంది. ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు ఊదరగొట్టి ప్రచారం చేసిన హామీ. గతంలో వైఎస్ జగన్ హయాంలో చేయూత ద్వారా ప్రతి ఏటా రూ.18,750 మహిళల అకౌంట్లలో జమ చేసి.. మొత్తం రూ.19 వేల కోట్లు జమ చేసారు. అంతేకాకుండా వారి స్వయం ఉపాధికి తోడ్పాడును అందిస్తూ.. ప్రముఖ సంస్థలతో టైఅఫ్ చేసుకుని వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు నందించారు.
2014లో చంద్రబాబు రూ.14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకుండా మహిళలను మోసం చేశారు. అదే విధంగా 2016 అక్టోబరు నుంచి సున్నావడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారు. దాంతో ఏ, బీ గ్రేడ్లుగా ఉన్న డ్వాక్రా గ్రూపులు సీ,డీ గ్రేడ్లుగా మారిపోయాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.25వేల కోట్లును ఆసరా పథకం ద్వారా.. మహిళా సంఘాలకు 2019 ఏఫ్రిల్ వరకు ఉన్న అప్పు తీర్చి ఆదుకున్నారు.
తద్వారా గతంలో చంద్రబాబు హయాంలో సీ, డీ గ్రూపులుగా ఉన్న డ్వాక్రా సంఘాలు తిరిగి ఏ, బీ గ్రూపులుగా మారాయి. అంతగా మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థాయిలో కూర్చొబెట్టిన ఘనత వైఎస్ జగన్‌ది. అయితే గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని సూపర్ సిక్స్‌తో సహా 143 హామీలిచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడం మహిళలను మోసం చేయడమేనని వరుదు కళ్యాణి తేల్చి చెప్పారు. ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.