
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర బెదిరింపులు తారాస్థాయికి చేరాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఆలపాటి రాజేంద్రకు శాతవాహన కళాశాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. శాతవాహన భూములను కాజేస్తుంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు మౌనం వహిస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడ నడి బొడ్డున వందల కోట్ల విలువైన భూమిని దక్కించుకునేందుకు వర్గాలు తయారయ్యాయి. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర శాతవాహన భూముల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆలపాటి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి. శాతవాహన కాలేజ్ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్‌ను ఆలపాటి బెదిరించారు. తన మాట వినకపోతే కుటుంబాన్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆలపాటి రాజేంద్రకు శాతవాహన కళాశాలకు సంబంధం ఏంటి?. ఎందుకు విద్యాసంస్థల్లోకి ఆలపాటి చొరబడ్డారో సమాధానం చెప్పాలి. అధికార ప్రభుత్వం ఏం చేస్తోంది.
శాతవాహన కాలేజ్ ప్రిన్సిపాల్‌ను గతంలో ఆలపాటి కిడ్నాప్ చేశారు. తాజాగా ఫోన్‌లో బెదిరించారు. అధికార పార్టీ నేతలే ఇలా కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటే చంద్రబాబు, లోకేష్ ఏం చేస్తున్నారు?. శాతవాహన కాలేజ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మేం పోరాటం చేశాం. గత ప్రభుత్వంలో శాతవాహన కాలేజ్ భూములను కబ్జాల నుంచి కాపాడాం. టీడీపీ ప్రభుత్వం రాగానే శాతవాహన భూముల్లోకి కబ్జాదారులు చొరబడ్డారు. శాతవాహన భూములను కాజేస్తుంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు మౌనం వహిస్తున్నారు. శాతవాహన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?. కొంతమంది ఫిర్యాదులు చేసినా పోలీసులు కనీసం చర్యలు తీసుకోవడం లేదు.
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని ఆలపాటి చెబుతున్నారు. కబ్జా చేస్తున్నాననే అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారా?. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కబ్జాను ప్రోత్సహిస్తున్నట్లుగానే భావిస్తాం. తనపై ఫిర్యాదు చేసిన వంకాయలపాటి శ్రీనివాస్‌ను ప్రెస్ మీట్ పెట్టి ఆలపాటి బెదిరిస్తున్నారు. భూములు కబ్జా చేయడం కోసం సామాన్యులను బెదిరిస్తారా?. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని శాతవాహన భూములను కాపాడాలి’ అని డిమాండ్ చేశారు.