
ఎల్లో మీడియా ప్రతిరోజూ తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది
ప్రభుత్వం, ఎల్లో మీడియా, కొందరు పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారు
కోర్టులంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారు
చట్ట పరిధిని దాటిన ప్రతి ఒక్కరినీ కోర్టుకీడుస్తాం
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి హెచ్చరిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మీడియా ట్రయల్ జరుగుతోందని.. ఎల్లో మీడియా ప్రతిరోజూ వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా తప్పుడు కథనాలు వండి వడ్డిస్తోందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా, కొందరు పోలీస్ అధికారులు కలిసి చట్ట పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏమీ లేకపోయినా తప్పుడు వార్తలు సృష్టించి.. లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని, కొందరు ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
టీడీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు పేరును చేర్చిన అధికారులను.. ఇప్పుడు టార్గెట్ చేసుకొని దర్యాప్తును అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నారని.. నేరం ఎలా జరిగిందో వారే రాస్తారని.. అందులో ఎవరెవరు ఉన్నారో కూడా వారే రాస్తారని.. ఇంకా ఎవరెవరిని స్కామ్‌లో చేర్చవచ్చో కూడా డిసైడ్ చేస్తూ డిబేట్‌లు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనే ఆదేశించారని రాజ్ కేసిరెడ్డి సిట్ విచారణలో చెప్పినట్లుగా ఈనాడులో రాసుకొచ్చారని మండిపడ్డారు. సిట్ ఏ ప్రశ్నలడిగిందో.. దానికి రాజ్ కేసిరెడ్డి ఏ జవాబులిచ్చారో కూడా రాసుకొస్తున్నారంటూ దుయ్యబట్టారు.
జర్నలిజం ప్రమాణాలు గాలికొదిలేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. రాజ్ కేసిరెడ్డి ఒకటి చెబితే ఇక్కడ మరొకటి రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారని ఎల్లో మీడియాను నిలదీశారు. మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగినప్పుడు.. మిథున్‌రెడ్డి పాత్రను ఎక్కడా ధ్రువీకరించలేదంటూ ప్రాసిక్యూషన్ చెప్పిందని గుర్తు చేశారు. మళ్లీ సుప్రీంకోర్టులో మిథున్‌రెడ్డికి సంబంధం ఉందంటూ కౌంటర్ వేశారని మండిపడ్డారు. కోర్టులను కూడా తప్పుదోవపట్టించేలా ప్రాసిక్యూషన్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగం, చట్టం, కోర్టులంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారని.. వారికి ఎల్లో మీడియా వంతపాడుతోందని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ మీద ప్రతిరోజూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని.. కూటమి ప్రభుత్వం, కొందరు పోలీస్ అధికారులు, ఎల్లో మీడియా కలిసి ఎవరెవరిని ఎలా ఇరికించాలా? అని కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. చట్ట పరిధిని దాటి వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరినీ కోర్టుకీడుస్తామని హెచ్చరించారు.