
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇటు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. మెగా అభిమానులు కూడా బాలయ్యను టార్గెట్ చేసి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘సంస్కారం లేని వ్యక్తి బాలకృష్ణ. మందు తాగి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. చిరంజీవి తనతో సమానమని బాలకృష్ణ అనుకుంటారు. చిరంజీవి కాలిగోటికి బాలకృష్ణ పనికిరారు. స్వశక్తితో చిరంజీవి హీరోగా ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయించిన రోజే బాలకృష్ణ చచ్చిపోయారు. బాలకృష్ణను కాల్పుల ఘటనలో కాపాడింది వైఎస్సార్. బాలకృష్ణ సినిమాలకు రేట్లు పెంచమని ఆదేశాలు ఇచ్చింది వైఎస్ జగన్. విశ్వాసం లేని వ్యక్తి బాలకృష్ణ. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు. చిరంజీవి ప్రకటన ద్వారా బాలకృష్ణ చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది. చిరంజీవి దంపతులను వైఎస్ జగన్ దంపతులు ఎంతో గౌరవించారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి అని కామెంట్స్ చేశారు.

వైఎస్సార్ జిల్లా...
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..‘అసెంబ్లీలో బాలకృష్ణ జులాయిగా వ్యవహరించాడు. బాలకృష్ణ ఇంట్లో గన్ ఫైర్ ఘటనలో నిన్ను కాపాడింది వైఎస్సార్ మరిచిపోయావా?. వైఎస్ జగన్ సినీ పరిశ్రమ పట్ల స్పందించిన తీరును స్వయాన చిరంజీవి లేఖ రూపంలో తెలిపారు. నాడు వైఎస్ జగన్ చిరంజీవిని ఎంత ఆప్యాయంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీని ఇంటికి పిలిచి వైఎస్ జగన్ సమస్యలను పరిష్కరించారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్‌ని అప్రతిష్ట పాలు చేసేలా కూటమి నాయకులు విమర్శించే పనిగా పెట్టుకున్నారు. బసవతారక క్యాన్సర్ ఆసుపత్రికి కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి డబ్బులు మంజూరు చేసింది జగన్ అని తెలిపారు.

కాకినాడ..
వైఎస్సార్‌సీపీ నాయకురాలు వంగా గీతా మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై బాలకృష్ణ, కామినేని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మాజీ సీఎం పట్ల అసెంబ్లీలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సభను అగౌరపరచడమే. అసెంబ్లీ అనేది ఎంతో పవిత్రమైన స్ధలం. కేవలం 175 మందికి మాత్రమే ఆ పవిత్రమైన స్ధలంలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. చంద్రబాబు హయంలో టీడీపీ అధికారంలోకి వచ్చాకా.. ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకైనా పెట్టారా?. వైఎస్ జగన్ మాత్రమే ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టారు. వైఎస్ జగన్‌కు ప్రజలంటే అభిమానం. చిరంజీవి చాలా సౌమ్యమైన వ్యక్తి. ఎప్పుడు ఒక్క అడుగు తగ్గే ఉంటారు. వైఎస్ జగన్, చిరంజీవి ఎదుట వారిని గౌరవించే వ్యక్తులు. ఎవర్ని తక్కువ చేయాలనుకునే వ్యక్తులు కాదు. అలాంటి ఆ ఇద్దరు వ్యక్తులను చాలా తేలికగా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. ఇక ముందు వైఎస్ జగన్, చిరంజీవిని తక్కువగా చేసి మాట్లాడవద్దు అని హితవు పలికారు.
విశాఖ..
మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ..‘బాలకృష్ణ పెద్ద సైకో. బాలకృష్ణను మించిన సైకో మరొకరు లేరు. వైఎస్ జగన్‌కు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారు. చిరంజీవిని చూసి బాలకృష్ణ ఓర్వలేకపోతున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో సినీ బృందాన్ని వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా గౌరవించారు. తాగుబోతు బాలయ్యకు నోరే సరిగా తిరగదు. బాలకృష్ణ నటనకు ఏనాడు అవార్డుల రాలేదు. రికమండేషన్లతో అవార్డులు సాధించిన వ్యక్తి బాలకృష్ణ అని చెప్పారు.

వైఎస్సార్ జిల్లా..
నందమూరి బాలకృష్ణపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజాద్ బాషా మాట్లాడుతూ..‘అసెంబ్లీని బాలకృష్ణ అపహాస్యం చేశారు. మందు తాగి వచ్చిన వ్యక్తిలా నందమూరి బాలకృష్ణ ప్రవర్తించాడు. ఆయన వ్యాఖ్యలను వైఎస్సార్ పార్టీ పూర్తి ఖండిస్తుంది. బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి సైతం ఖండించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కనీసం ఖండించలేదు’ అని ఘాటు విమర్శలు చేశారు.