సాక్షి, ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్ట్‌లకు వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒక్కరూ కూడా భయపడరని వైఎస్సార్‌సీపీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. జోగి రమేష్ ఎంత ధైర్యంగా లోపలకు వెళ్ళారో.. అంతే ధైర్యంగా బయటకి వచ్చారని చెప్పుకొచ్చారు.
జైలు నుంచి విడుదలైన జోగి రమేష్‌ను ఆయన నివాసంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కలిశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ..‘కూటమి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక అంశాలపై ప్రశ్నించినందుకు జోగి రమేష్ అరెస్ట్ చేశారు.83 రోజులు జోగి రమేష్, అతని సోదరుడిని జైలు పెట్టారు. జోగి రమేష్ కడిగిన ముత్యంలా వస్తారని ఆ రోజే చెప్పం. కోర్ట్ కూడా నమ్మింది బెయిల్ ఇచ్చింది.
కూటమి అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన కూటమి అన్యాయాన్ని జోగి ప్రశ్నిస్తున్నాడు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా, జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినా ఎవరిని బయపెట్టలేరు. అరెస్టులకు ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్త భయపడరు. వైఎస్ జగన్ నాయకత్వంలో మరింత చురుగ్గా పాల్గొంటారు. జోగి రమేష్ భార్య, కుమారులపై కక్ష పూరితంగా కేసులు పెట్టారు. వ్యక్తుల మీదనే కాకుండా కుటుంబంపైన కేసులు పెడుతున్నారు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ మాట్లాడుతూ..‘చేయని తప్పులకు 83 రోజులు జోగి రమేష్‌ను జైలులో పెట్టారు. జైలులో పెట్టడం తప్ప కూటమి నేతలు ఏమీ చేయలేరు. కూటమి చర్యలు చూసి ఆంధ్రప్రదేశ్ అంతా నవ్వుతుంది. జోగి రమేష్ మీదనే కాదు.. కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారు. ఈరోజు మీరు నాటిన విత్తనం రేపు చెట్టు అవుతుంది. మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్లపై 2029లో చట్టబద్దంగా చర్యలు తీసుకుంటాం. జోగి రమేష్ ఎంత ధైర్యంగా లోపలకు వెళ్ళారో.. అంతే ధైర్యంగా బయటకి వచ్చారు. రెట్టించిన ఉత్సాహంతో జోగి రమేష్ కూటమి పాలనపై పోరాటం చేస్తారు అని తెలిపారు.


