
తాడేపల్లి : చంద్రబాబు రాజకీయ ప్రస్థానం నుంచి చూస్తే ఇప్పటివరకూ ఆయన చేయని అవినీతి లేదని విమర్శించారు వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్. ఏలేరు స్కాం నుండి నిన్నటి రాజధాని భూముల వరకూ అన్నింటిలోనూచంద్రబాబు దోచుకున్నారని ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలకు బిగ్‌బాస్ చంద్రబాబేనని మండిపడ్డారు.
ఈరోజు(సోమవారం, జూలై 21) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన.. జగన్‌ని బిగ్‌బాస్ అని వార్తలు రాస్తున్న ఈనాడే సంస్థే అతిపెద్ద ఆర్థిక నేరాలకు పాల్పడించన్నారు. వారి ఆర్థిక సామ్రాజ్యానికి భంగం కలుగుతోందని జగన్‌పై అడ్డగోలు వార్తలు రాస్తోందని పోతిన్ మహేష్ విమర్శించారు.
‘ 2014-19 కాలంలో మద్యం మాఫియా మొత్తాన్ని చంద్రబాబు తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. 4,380 మద్యం షాపులు, మరో 4,380 పర్మిట్ రూములు, 45 వేల బెల్లుషాపులు చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. విచ్చలవిడిగా బ్రాండ్లు తేవటం, కమీషన్లు లాక్కోవటం అన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయి. మద్యం మాఫియాని వ్యవస్థీకృతం చేసిందే చంద్రబాబు. జగన్ అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రించారు. ఇది తట్టుకోలేక జగన్‌పై ఇష్టానుసారం విష ప్రచారం చేశారు. మద్యం పాలసీ అంతా జగన్ హయాంలో పారదర్శకంగా జరిగింది. జగన్ నిర్ణయాలు చంద్రబాబు మాఫియాకి కంటకింపుగా మారాయి.
అందుకే మద్యం పాలసీ మీద విష ప్రచారం చేశారు. లిక్కర్ లో విషం ఉందని కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఈ ప్రచారం తప్పని చెన్నై లోని ఎన్‌జీఎస్ ల్యాబ్ కూడా ధ్రువీకరించింది. అయినా సరే ఈ పచ్చమూక ఆగకుండా తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలోనే రకరకాల బ్రాండ్లు వచ్చాయి. ప్రెసిడెంట్ మెడల్, పవర్ స్టార్ ఇలా అనేక బ్రాండ్లు తెచ్చింది చంద్రబాబే. 14 డిస్టలరీలకు చంద్రబాబే అనుమతులు ఇచ్చారు. జగన్ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతులు ఇవ్వలేదు. కమీషన్ల తీసుకుని ఆర్డర్లు ఇచ్చింది కూడా చంద్రబాబు. దీనిపై ఎక్కడైనా చర్చించటానికి మేము సిద్దం. ఐదు డిస్టలరీలకు యాభై శాతం ఆర్డర్లు ఇవ్వటం వెనుక కచ్చితంగా స్కాం ఉంది.
జగన్ హయాంలోని మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని సీసీఐలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీసిఐ విచారణ జరిపి ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చి చెప్పింది. అయినా సరే చంద్రబాబు అండ్ కోకి బుద్ది రాలేదు. ప్రతిసారీ ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉన్నారు. కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా విక్రయాలు జరపలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. నిజానికి ఆ సంస్థలు అడ్వాన్స్ గా నిధులు ఇస్తేనే సరఫరా చేస్తామన్నాయి. ప్రభుత్వం ఏ కంపెనీకైనా అలా అడ్వాన్సులు ఇస్తుందా?, చంద్రబాబు, ఆయన పార్టీ నేతల డిస్టలరీలకు ఆర్డర్లు రాలేదని విష ప్రచారం చేశారు.

ప్రివలేజ్ ఫీజుని తన హయాంలో చంద్రబాబు ఎందుకు రద్దు చేశారు?, క్యాబినెట్ కి కూడా తెలియకుండా ఎందుకు చేశారు?, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాకుండా ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి?, అపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఎంజీ సంస్థకు వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టి అక్రమాలు చేసింది చంద్రబాబు. ఏలేరు స్కాం నుండి రాజధానిలో భూముల కొనుగోలు వరకు అన్ని అక్రమాల్లోనూ చంద్రబాబే బిగ్ బాస్’ అని పోతిన మహేష్ ఆరోపించారు.