
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే పెట్టుబడులన్నీ కట్టుకథలేనని విమర్శించార వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్. ఆయన సీఎం అయిన ప్రతీసారి ఇలాంటి కట్టుకథలే చెప్పుకుంటూ ఉంటారని మండిపడ్డారు. ఈరోజు(శనివారం, జూన్ 28) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన మహేష్.. కోటి ఉద్యోగాలు అంటూ 1999లో చెప్పి కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదనే విషయాన్ని పోతిన మహేష్ గుర్తు చేశారు. ‘ 2014లో కూడా 25 లక్షల ఉద్యోగాలు, పది లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తానని కథలు వినిపించారు.
2024లో కూడా 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ మళ్ళీ మోసం చేశారు. ఇలా ప్రతిసారీ దారుణమైన అబద్దాలు చెప్పి జనాన్ని వంచిస్తూనే ఉన్నారు. కోటి యాభై లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నట్టు చంద్రబాబుకు చెందిన ఎల్లోమీడియానే చెప్పింది. మరి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు?, ప్రపంచంలో ట్రెండింగులో ఉన్న నాలుగు పదాలను పట్టుకుని అది తానే చేశానంటూ భజన చేయించుకోవటం చంద్రబాబుకు అలవాటు. చంద్రబాబు చెప్పే మాటలు హంబక్కేనని ప్రజలు గుర్తించాలి. జగన్ తెచ్చిన పరిశ్రమలను కూడా తానే తెచ్చినట్టు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఎన్టీపీసీ లక్షా పదివేల కోట్ల విలువైన ఎంఓయూని జగన్ ప్రభుత్వంలో చేసుకుంది. అన్ని అనుమతులు, భూకేటాయింపులన్నీ జగనే చేశారు. కానీ చంద్రబాబు చేసినట్టు భజన చేసుకుంటున్నారు
ఇలా అనేక ప్రాజెక్టులను జగన్ తెస్తే చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. పెట్టుబడులు తెచ్చేది జగన్, ప్రచారం చేసుకునేది చంద్రబాబు. కూటమి నేతల బెదిరింపులు, దాడులకు పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరైనా పెట్టుబడులు పెట్టటానికి వస్తారా?, బాలాజీగోవిందప్ప లాంటి పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలను అరెస్టులు చేసి జైల్లో పెడితే ఇక ఎవరు పెట్టుబడులు పెడతారు?, జిందాల్ కూడా చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక మహారాష్ట్రకు పారిపోయారు.
తాడిపత్రిలో ఆదినారాయణరెడ్డి ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేయించారు. పల్నాడులో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సిమెంట్ ఫ్యాక్టరీలపై దాడి చేయించారు. శ్రీకాకుళం, శ్రీకాళహస్తిలలో అక్కడి ఎమ్మెల్యేలు కమిషన్ల కోసం వేధించలేదా?, మైహోం వారి సిమెంట్ ఫ్యాక్టరీపై వేధింపులకు పాల్పడలేదా?, కృష్ణపట్నం పోర్టు నుండి కమీషన్లు ఇవ్వలేదని సోమిరెడ్డి దాడి చేశారు. కమీషన్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు సీజ్ ద ఫ్యాక్టరీ అంటున్నారు. ఇలాంటి వారి వలన రాష్ట్రానికి ఎలా పెట్టుబడులు వస్తాయి?, అశోక్ లేలాండ్ 2021లో జగన్ హయాంలోనే ఉత్పత్తి ప్రారంభించింది. స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ కూడా అయింది. కానీ లోకేష్ వెళ్ళి మళ్ళీ ప్రారంభిస్తున్నట్టు బిల్డప్పులు ఇచ్చారు
డైకిన్ సంస్థ 2022లో జగన్ హయాంలో ప్రారంభిస్తే దాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఎవరి హయాంలో ఎన్నెన్ని పరిశ్రమలు వచ్చాయో చర్చకు సిద్దమా?, చంద్రబాబు బినామీ కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నారు. ఎకరం 99 పైసలకే ఎవరికోసం ఇస్తున్నారో చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు ఏమీ లేవు. ఉద్యోగాల కల్పన అనేదే జరగటం లేదు. కానీ వేల కోట్ల విలువైన భూములను తమ బినామీ కంపెనీలకు దోచి పెడుతున్నారు. దీనిపై ప్రజలు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి’ అని పోతిన మహేష్ పేర్కొన్నారు.