
తాడేపల్లి: వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు ముఠా చేతులెత్తేసిందని.. వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్ ఎద్దేవా చేశారు. మద్యం కేసులో కోర్టుల కంటే ముందే ఎల్లోముఠా విచారణ చేస్తోందన్నారు. ఆధారాలు ఉన్నాయని కాసేపు, చెరిపేశారని మరి కాసేపు అంటున్నారు. వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు రోజుకొక భేతాళ కథ అల్లుతున్నారు. 375 కోట్ల పేజీల డేటాను తొలగించారంటూ కొత్త కథ అల్లుతున్నారు. ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాల్లేకనే ఇలాంటి కథలు చెప్తున్నారు. కోర్టులో ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారు’’ అని పోతిన మహేష్ అన్నారు.
‘‘నిజంగా డేటా డిలిట్ అయితే బేవరేజ్ కార్పోరేషన్ మీద ఎందుకు కేసులు పెట్టటం లేదు?. కంపెనీల దగ్గర ఉండే డేటా కూడా మాయం అయితే మరి వాటిపై కేసులు పెట్టాలి కదా?. డిస్టిలరీలకు ముడి సరుకు విక్రయించే సంస్థల దగ్గరైనా డేటా ఉంటుంది. అది కూడా డిలిట్ అయిందా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. మద్యం క్రయ విక్రయాలన్నీ క్యూఆర్ కోడ్ ద్వారానే జరిగింది. అయినప్పటికీ అక్రమాలు అంటూ రోజుకొక కట్టుకథ అల్లుతున్నారు. జగన్ హయాంలో ఎలాంటి స్కాం జరగలేదని చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ తప్పుడు వాంగ్మూలాలతో అరెస్టులు చేస్తున్నారు’’ అని పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘స్కాంలో రాజ్ కసిరెడ్డి కీలకం అని మొదట్లో అన్నారు. తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కీలకం అన్నారు. ఇప్పుడు మిథున్‌రెడ్డి కీలకం అంటున్నారు. తనకు సంబంధం ఉన్నట్టు ఆధారాలు చూపమని మిథున్‌రెడ్డి సవాల్ చేస్తే ప్రభుత్వం స్పందించలేదు. మిథున్‌రెడ్డి కంపెనీలోకి ఐదు కోట్లు వచ్చాయని తప్పుడు కథనాలను ఎల్లో మీడియా రాసింది. మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టులో రాబోతున్నదని ఆయనపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. కోర్టుల కంటే ముందే ఎల్లో మీడియా ట్రయల్ నిర్వహిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం 30 ఏళ్ల క్రితమే భూములు కొన్నది. ఈ 30 ఏళ్లలో 15 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉన్నారు. మరి ఈ15 ఏళ్లలో కనపడని అక్రమాలు ఇప్పుడే ఎలా కనపడ్డాయి?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు.
‘‘ఎల్లో మీడియా వార్తలు రాయటం, వెంటనే ప్రభుత్వం ఓవరాక్షన్ చేయటం పరిపాటి అయింది. సినిమా విషయాల్లో ప్రభుత్వం జోక్యం ఏంటని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు. మరి మంత్రి కందుల దుర్గేష్ ఇప్పుడు ఎందుకు విచారణ చేస్తోంది?. టీడీపీ నేతలే థియేటర్ల బంద్ వెనుక ఉన్నారని జనసేన నేతలు అంటున్నారు. కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం సాధించారు?’’ అని మహేష్ నిలదీశారు.