
ప్రకాశం జిల్లా: తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు థర్డ్ ప్రయోగించడంపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అని కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు ఆదిమూలపు.
ఈ మేరకు మంగళవారం మాట్లాడిన ఆదిమూలపు సురేష్.. ‘దళిత యువకులపై పోలీసులు పాశవిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రెడ్ బుక్ ర్యాజ్యాగం శ్రుతిమించి అమలు చేస్తున్నారు. నడిరోడ్డు పై కర్రలు విరిగే దాకా పోలీసులు కొట్టడం చూస్తుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనిపిస్తోంది. ఆత్మగౌరవం దెబ్బతినేలా, సభ్య సమాజం తలదుంచుకునేలా పోలీసులు తీరు ఉంది.
తెనాలి ఘటనపై హోంమంత్రి బాధ్యత వహించాలి. తక్షణమే సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ను, మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తాం. కూటమి ప్రభుత్వంలో దళిత బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదు. పోలీస్ స్టేషన్ లు ఒక వర్గానికి, ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నాయి’ అని మండిపడ్డారు ఆదిమూలపు సురేష్.
కాగా, ముగ్గురు దళిత, మైనారిటీ యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి.. ఇద్దరు పోలీసు అధికారులు లాఠీలతో విచక్షణారహితంగా కొట్టిన ఘటన మంత్రి నాదెండ్ల మనోహర్ ఇలాకా గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. యువకుల అరికాళ్లపై పోలీసులు కర్కశంగా లాఠీలతో చితకబాదారు.