సాక్షి, కాకినాడ: ఏపీలో బెల్టు షాపులకు సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు వైఎస్సార్‌సీపీ నాయకులు కురుసాల కన్నబాబు. డోర్ డెలివరీ స్థాయికి మద్యాన్ని తీసుకొచ్చారని అన్నారు. కూటమి సర్కార్ ఏపీని డ్రగ్స్ డెన్‌గా మార్చేసిందని మండిపడ్డారు. లులు కంపెనీపై చంద్రబాబుకు ఎందకంత ప్రేమ? అని కన్నబాబు ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు కురసాల కన్నబాబు కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. వేదిక ఏదైనా చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ, వైఎస్ జగన్‌ను తిట్టడానికే వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఎవరికి క్రెడిబులిటి ఉందో ప్రజలకు తెలుసు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. కరోనా వంటి కష్ట కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసింది వైఎస్ జగన్. ఒక నాయకుడిని ఓడించడం కోసం మూడు పార్టీలు కలిసి కూటమి కట్టడం ఒక చరిత్రే. రూ.500 కోట్లతో ఒక్కో మెడికల్ కళాశాలల్ని కట్టాలని వైఎస్ జగన్ అనుకున్నారు. అవన్నీ వద్దని మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు
ఎన్టీఆర్ వర్ధంతిలో చంద్రబాబు తనకు తనకే కీర్తించుకున్నారు. రాష్ట్రంలో పప్పు బెల్లల్లా ఎకరాలకు ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలను దారదత్తం చేస్తున్నారు. లులు కంపెనీ మీద ఎందుకు మీకు అంత ప్రేమ. విశాఖ హార్బర్ సమీపంలో కోట్లాది రూపాయల విలువైన భూములను నామమాత్రపు లీజుకు లులుకు ఇస్తున్నారు. విజయవాడలో ఆర్టీసి స్థలాన్ని కూడా లులుకు ఇస్తున్నారు. ఉర్సా అనే కంపెనీకి ఎకరా రూ.99 పైసలకే కేటాయించారు. మొత్తం భూమి రూ.99పైసలకే ఇచ్చేస్తానని మంత్రి లోకేష్ అంటున్నారు. భూములు పంచుకునేది మీరు. వైఎస్ జగన్ హయంలో జరిగింది అని ఎలా చెబుతున్నారు. నాయుడుపేట నుండి సత్యసాయి జిల్లా వరకు భూముల పందేరం జరుగుతోంది.
కూటమి అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక అని హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ.18వేల నుండి రూ.19వేలకు అమ్ముతున్నారు. అడ్డగోలుగా ఇసుకను తినేసిన చరిత్ర టీడీపీది. మీకు ఉన్న మీడియా బలం దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉందా?. ఒక మీడియా వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి, మరో మీడియాకు విశాఖలో భూములు ఇస్తారు. రాష్ట్రంలో మద్య నిషేధం ఎన్టీఆర్ అమలు చేస్తే.. దానిని ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుది కాదా?. బెల్టు షాపులకు సృష్టికర్త చంద్రబాబు. రాష్ట్రంలో నకిలీ మద్యం పరిశ్రమగా నడిపిన చరిత్ర మీది కాదా?. ఈనెల ఒకటో తేదీ నుండి 17 వరకు రూ.17 కోట్ల మద్యాన్ని అమ్మారు. ఈ సంక్రాంతి లిక్కర్ సిండికేట్లకు సంక్రాంతి అయ్యింది. డోర్ డెలివరీ స్థాయికి మద్యాన్ని తీసుకువచ్చారు. గంజాయితో పాటుగా ప్రమాదకర మాదక ద్రవ్యాలు లభ్యమవుతున్న పరిస్ధితి రాష్ట్రంలో ఉంది.
ఏపీలోనే కాదు.. ఈ దేశంలోనే వైఎస్ జగన్ శక్తివంతమైన నాయకుడు. చరిత్ర వక్రీకరించి.. ఒక కులమే ఆరాధనీయ కులం అని చెప్పుకుంటుంది. సంక్రాంతే కమ్మేవారి పండుగ అని చెప్పుకునే పరిస్ధితి వచ్చింది. సూర్య సిద్దాంతం, ఆర్యభట్ట సిద్దాంతం నుండి సంక్రాంతి ప్రస్తావన ఉంది. సంక్రాంతి ఒక కులానికి, ప్రాంతానికి సంబంధించినది కాదు. జానపదాల్లోను, శ్రీనాధుడు, అన్నమయ్య రచనలలోను సంక్రాంతి ప్రస్తావన ఉంది అని అన్నారు.


