సాక్షి, తాడేపల్లి: ఏపీలో దళితులకు రక్షణ లేదంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు. ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటు వేశారనే కారణంతో దళితులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పని చేయడం లేదని కూటమి నేతలపై ఘాటు విమర్శలు చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు, దళితులు జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితి అదే. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు.. రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి పరిస్థితి లేదు. ఓటు వేశారా? లేదా? అనే తారతమ్యాలు లేవు.
కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. మందా సాల్మన్ హత్య ప్రభుత్వం చేసిన హత్యే. ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. సాల్మన్ హత్యను కోర్టులు సుమోటోగా తీసుకోవాలి. రాష్ట్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వం ఉంది. దళితులంతా ఒకసారి ఆలోచన చేయాలి. పోరాటమా.. శరణమా తేల్చుకోవాలి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల హత్యలపై ప్రజా ఉద్యమం చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.



