
సాక్షి, వైఎస్సార్: కూటమి ప్రభుత్వం ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను, జనాన్ని వేరు చేయలేరని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. వైఎస్ జగన్ నెల్లూరు వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు స్వేచ్ఛగా తిరగారు అని గుర్తు చేశారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి, సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైళ్లో పెట్టారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. జగన్ నెల్లూరుకు వెళ్తున్నాడంటే.. ఈ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. జిల్లా మొత్తాన్ని అష్టదిగ్భందనం చేస్తున్నారు.. మా జిల్లా అధ్యక్షుడికి నోటీసులిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు స్వేచ్ఛగా తిరగారు. మా ప్రభుత్వంలో వీళ్లెవరికీ మేం నోటీసులు ఇవ్వలేదు.. ఇబ్బంది పెట్టలేదు.
పది మందికి అనుమతా?.
జగన్ హెలిపాడ్ వద్దకు పది మందికే అనుమతి అంటున్నారు.. మూడు వాహనాలు మాత్రమే అనుమతి అంటున్నారు. కాకాణి పరామర్శకు ముగ్గురు, నల్లపురెడ్డి ఇంటి వద్ద వంద మందికి మాత్రమే అనుమతి అంటూ షరతులు పెడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లకు ఒకటే సూటి ప్రశ్న. ఇదే ఆంక్షలు గత ఐదేళ్లు మేమూ పెట్టుంటే మీరు తిరిగేవారా?. చంద్రబాబూ.. నువ్వు రాష్ట్రమంతా పర్యటన చేసేవాడివా?. లోకేశ్.. నువ్వు యువగళం అంటూ తిరగగలిగేవాడివా?. పవన్ కల్యాణ్.. ఇవే ఆంక్షలు మేం పెట్టి ఉంటే కారు టాప్‌పై కూర్చుని సినిమా యాక్షన్ చేయగలిగేవాడివా?.
జగన్ ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, జగన్ అంటేనే జనం. ఆయన ఎక్కడ పర్యటనకు వచ్చినా ఏ వైఎస్సార్‌సీపీ నేత జనసమీకరణ చేయాల్సిన అవసరం లేదు. జగన్ ఎక్కడ ఉంటే జనం అక్కడ ఉంటారు.. జగన్ వెంటే జనం. ఈ విషయం ఈ ప్రభుత్వానికి, అధికారులకు తెలుసు. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. అందుకే ప్రజలు జగన్ పరిపాలనే మేలు అంటూ ఆయన వెంటే నడుస్తున్నారు. ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంలో పడుతున్న బాధలు, ఇబ్బందులు చెప్పుకునేందుకే జనం జగన్ వద్దకు వస్తున్నారు. మీరు ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా, అడ్డుకున్నా.. జగన్ నుంచి జనాన్ని వేరు చేయలేరు. ఎవరూ నెల్లూరు నగరంలోకి రాకూడదని ఆంక్షలు పెట్టడం సమంజసమేనా?.

జగన్ పేరంటే భయమా?
మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడికైనా పర్యటనకు వెళితే మీరెందుకు ఇంతగా భయపడుతున్నారు?. ఆయన ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎక్కడికి వెళ్లినా.. ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు?. ఎందుకు పేరు వింటే భయపడిపోతున్నారు?. వైఎస్సార్‌సీపీ నుంచి 11మంది గెలిచినా.. 40 శాతం ప్రజాభిమానాన్ని పొందింది. మీరు అవునన్నా కాదన్నా వైఎస్సార్‌సీపీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడు. మీరు ఆయనకు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే ప్రతిపక్ష నేత. ఆయనకు 40శాతం ఓట్లు ఇచ్చి ప్రజలే ప్రతిపక్ష హోదా కల్పించారు. అలాంటి నేత పరామర్శలకు వెళితే ఇలాంటి ఆంక్షలు పెట్టడం సరికాదు.
చంద్రబాబు, లోకేష్‌లకు రాని జనం జగన్‌కు వస్తున్నారని ఇలా ఆంక్షలు పెడుతున్నారా?. మీరు డబ్బులు, బిర్యానీ, మందు ఇచ్చినా మీ పర్యటనలకు జనాలు రావడం లేదు. కానీ, జగన్ కాలు బయటపెడితే ఇవేమీ అవసరం లేదు.. స్వచ్ఛందంగా ప్రజలే స్వాగతం పలుకుతారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంత పరిపాలనలో ఉన్నామా?. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల అభిమానాన్ని అడ్డుకోలేరు.. కచ్చితంగా నాలుగింతలు ప్రజలు వస్తారు. ఈ సంప్రదాయాన్ని మీరు ప్రారంభించారు.. భవిష్యత్తులో మీరు ఎక్కడా తిరగలేరని గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని అడ్డంకులు, ఆంక్షలు పెట్టినా జగన్ నెల్లూరు వస్తారు.. పర్యటన చేస్తారు. ఇలాంటి ఆంక్షలను ఇప్పటికైనా ప్రభుత్వం విరమించుకోవాలి’ అని హితవు పలికారు.