సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఏ పంట వేసినా గిట్టుబాటు ధరపై నమ్మకం లేకుండా పోయిందని, రైతు రోడ్డెక్కడం ఇప్పుడు సాధారణ ఘటనగా మారిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని, అవినీతి, దోపిడీ, రెడ్‌బుక్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని బుధవారం మీడియా సమావేశంలో జగన్ అన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
పొగాకు రైతులు, మామిడి రైతులు, అక్వా రైతులు వరుసగా ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని జగన్ అన్నారు. రైతు రోడ్డెక్కడం అంటే అది రైతు తప్పు కాదని, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
పొగాకు రైతుల్ని మోసం చేశారు
తమ ప్రభుత్వం హయాంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నామని జగన్ చెప్పారు. అయితే ప్రస్తుతం రైతులను ఆదుకున్నామని ఎల్లో మీడియాతో ప్రచారం చేయిస్తున్నా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. మొత్తం 240 మిలియన్ కిలోల పొగాకులో కేవలం 29 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారని, మిగిలిన రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆరోపించారు. ఈ పరిస్థితిలో పొగాకు రైతులు రోడ్డెక్క ఏం చేస్తారని జగన్ అన్నారు.
మామిడి రైతుల పరిస్థితి మరింత దారుణం
గతేడాది మామిడి కేజీకి రూ.12 ఇస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేశారని, ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైందని జగన్ అన్నారు. కర్ణాటకలో కేంద్ర మంత్రి కుమారస్వామి చొరవతో కేంద్ర సహకారం తీసుకుని మామిడి రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కూడా అదే విధంగా కేంద్రంతో మాట్లాడి రైతులను ఆదుకోవచ్చని, కానీ ఆయనకు అలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దీంతో రాష్ట్రంలోని మామిడి రైతులు వరుసగా రెండో ఏడాది కూడా సంక్షోభంలో చిక్కుకుని రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు.
అక్వా రంగం కుదేలైంది
తమ ప్రభుత్వం హయాంలో అక్వా రైతులకు అండగా నిలిచామని, కానీ ప్రస్తుతం రైతుల ఆమోదం లేకుండానే ఫీడ్ ధరలను పెంచి వారిపై అదనపు భారం మోపారని జగన్ ఆరోపించారు. గత ఏడాది మొదలైన సంక్షోభం ఈ ఏడాది మరింత తీవ్రమైందని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో అక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఎరువులు, విత్తనాల కోసం..
చంద్రబాబు పాలనలో యూరియా, సబ్సిడీ విత్తనాల కొరత తీవ్రంగా ఉందని జగన్ అంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులు రైతులను దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేవలం రెండేళ్ల పాలనలోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఖరీఫ్ సీజన్‌లో కూడా విత్తనాల పంపిణీ సక్రమంగా జరగలేదని ఆరోపించారు.
తమ హయాంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా రైతులకు అన్ని సేవలు అందించామని, మార్కెట్ కంటే రూ.50 తక్కువకే యూరియా సరఫరా చేశామని గుర్తు చేశారు. ఐదేళ్లలో యూరియా, విత్తనాలు, ఎరువుల కొరతతో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలేదని అన్నారు. అలాగే.. బాబు పాలనలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బాబు విచిత్ర వ్యాఖ్యలు..
యూరియా కొరతపై ప్రభుత్వం చెబుతున్న కారణాలు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయని జగన్ అన్నారు. "యూరియా ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుంది.. అందుకే ఈ పరిస్థితి వచ్చింది" అని చంద్రబాబు చెప్పడం రైతులను అవమానించడమేనని మండిపడ్డారు. "రైతు కంటే వ్యవసాయం గురించి మీకే ఎక్కువ తెలుసా చంద్రబాబు?" అంటూ ప్రశ్నించారు.
రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి లేదు
తనకు దగ్గర వాళ్ల ప్రయోజనాల కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని, రైతులకు మేలు చేయాలన్న ఆలోచన ఆయనకు ఏనాడూ లేదని జగన్ అంటున్నారు. పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర వస్తుందనే హామీ లేకుండా పోయిందని, కొనుగోలు జరుగుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతు భవిష్యత్తును ప్రభుత్వం పూర్తిగా అనిశ్చితిలోకి నెట్టేసిందని మండిపడ్డారు.


