
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతోంది అన్నది అందరూ చూస్తున్నారు.. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. బీహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేంటి?. ప్రజా ప్రతినిధులకు పోలీసులు గన్ చూపించి బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తాడిపత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే (కేతిరెడ్డి పెద్దారెడ్డి) తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాలున్నా.. పోలీసులు అడ్డుతగులుతున్న పరిస్థితి కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు.. గన్ చూపించమేంటి?. మనం ఎక్కడ ఉన్నాం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై పచ్చ సైకోలు.. అదీ పోలీసుల సమక్షంలోనే దాడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నా.. పచ్చ బ్యాచ్‌ను అడ్డుకోలేదు. ఆటవిక రాజ్యంలో ఉన్నామా?. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి.
బాధితుడు నల్లపురెడ్డి మీదనే కేసు పెట్టారు. ఇది శాడిజం కాదా?. కాకాణి, వంశీ, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి, పోసాని సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్‌పై కూడా కేసు పెట్టారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చ లేని అధికారులు. వారి మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. ఎంతో మంది అమాయకులపైనా తప్పుడు కేసులు బనాయించారు. తప్పుడు వాంగ్మూలతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు రాజకీయాల్లో దుష్ట సంప్రదాయం తెచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పరిస్థితి ఏంటి?. చంద్రబాబు నీ తప్పుడు సంప్రదాయం విష వృక్షం అవుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ప్రతి చర్యగా వీళ్లు కూడా ఇదే చేస్తే పరిస్థితి ఏంటి?.
చంద్రబాబు ఇప్పటికైనా మారకపోతే వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండదు. దెబ్బ తగిలిన వాడికే బాధ తెలుస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక మా వాళ్లు నా మాట కూడా వినరు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీ సహా చెల్లిస్తాం.’ అంటూ హెచ్చరించారు.
