
సాక్షి, గుంటూరు: ఏపీలో జరుగుతున్న స్కాంలకు పరాకాష్ట.. అమరావతి పేరుతో దోపిడీనేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న ఆర్థిక దోపిడీని వివరించారు.
‘‘అమరావతి పనుల కోసం 2018 లోనూ టెండర్లు పిలిచారు. నాడు ఖరారైన టెండర్ల విలువ రూ.41, 107 కోట్లు. దాదాపు 6 వేల కట్లు పనులు చేశారు. మిగిలిన రూ. 35 వేల కోట్లతో పనులు చేయాల్సి ఉంది. కానీ, ఈ టెండర్లు రద్దు చేేశారు. మిగిలిన ఆ పనుల అంచనాలు అమాంతం పెంచేశారు. ఇప్పటికే కట్టిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు కాకుండా మళ్లీ కడతారట. అంటే అన్నీ గంగపాలు చేసినట్లే!.

అక్రమాలకు అడ్డు కాకూడదని.. మా హయంలో తెచ్చిన జ్యూడీషియల్ ప్రివ్యూ తీసేశారు. రివర్స్ టెండరింగ్‌నూ రద్దు చేశారు. మొబలైజేషన్ అడ్వాన్స్‌లు లేవు. కానీ, స్కాంల కోసమే మొబలైజేషన్ అడ్వాన్స్‌లు తెచ్చారు. అడ్వాన్స్‌ల పేరిట 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. 2018 ఐకానిక్ టవర్‌ల పేరిట టెండర్లకు పిలిచారు. మిగిలిన పనులను ఇప్పుడు నిర్మాణ వ్యయం 4,468 కోట్లు. 2018తో పోలిస్తే దాదాపు రూ.2,417 కోట్లు (105 శాతం) పైగా పెంచారు. చదరపు అడుగుకు రూ.8, 931.. అంటే ఏమైనా బంగారంతో కడుతున్నారా?

మీరు సాయం చేస్తే.. పుంజుకుంటాం(ఈనాడు క్లిప్‌ను ప్రదర్శిస్తూ..) అంటూ చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆకాశాన్ని అంటేలా అప్పులు చేస్తున్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. సొంత లాభాలు, బినామీ ఆస్తులను పెంచుకునే పని పక్కన పెడితే.. ఇంతేసి అప్పులు చేయాల్సి ఉండదు కదా’’ వైఎస్ జగన్ సూచించారు.