నేతాజీ జయంతి.. వేడెక్కిన బెంగాల్‌ రాజకీయం

West Bengal Politics Around Netaji Birth Day - Sakshi

బోస్‌ జయంతిని పరాక్రమ్‌ దివస్‌గా ప్రకటించిన కేంద్ర సర్కారు

దేశ్‌ నాయక్‌ దివస్‌గా ఖరారు చేసిన సీఎం మమతా బెనర్జీ  

ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిపోయిన బోస్‌ పుట్టిన రోజు  

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో రాబోయే శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో బలాన్ని మరింత పెంచుకొనేందుకు, ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటివరకు వివిధ అంశాల్లో పార్టీల మధ్య మాటల యుద్ధం జరగ్గా, తాజాగా స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా విమర్శలు, ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. నేతాజీ పుట్టిన రోజును పరాక్రమ్‌ దివస్‌గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రకటించగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ్‌ నాయక్‌ దివస్‌గా ఖరారు చేశారు.

ఈ మేరకు వేడుకలు సైతం ప్రారంభించారు. అయితే, నెహ్రూ–గాంధీ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చడానికి నేతాజీ వారసత్వం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్యం చేసిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే నేతాజీ పేరును బీజేపీ వాడుకుంటోందని టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో జరగబోయే పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీకి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వారసత్వ అంశమే ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది.

నేతాజీ వారసత్వం కోసం పోటీ 
బీజేపీకి సంబంధించి సుభాష్‌ చంద్రబోస్‌ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిషర్లపై పోరాడేందుకు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని(ఐఎన్‌ఏ) ఏర్పాటు చేసిన ఒక యోధుడు. అయితే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌కు మాత్రం నేతాజీ బెంగాల్‌కు చెందిన ఒక గొప్ప హీరో, తమ ప్రాంతానికి పేరుతెచ్చిన నాయకుడు. అందుకే సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. నేతాజీ వారసత్వం విషయంలో రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.

నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను మొదటిసారిగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ డీక్లాసిఫై చేయించారని బీజేపీ ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో లబ్ధి కోసమే నేతాజీ జన్మదినాన్ని ఆర్భాటంగా నిర్వహించేందుకు బీజేపీ ముందుకొచ్చిందని టీఎంసీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేతాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని గుర్తుచేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top