బీహార్ లోక్‌సభ ఎలక్షన్.. మోదీ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

బీహార్ లోక్‌సభ ఎలక్షన్.. మోదీ కీలక వ్యాఖ్యలు

Published Mon, May 13 2024 10:11 AM

We Wont Lose Any Seat This Time in Bihar Says PM Modi

పాట్నా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో రోడ్‌షో నిర్వహించిన ప్రధాని 'నరేంద్ర మోదీ' కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల కంటే ఈ సారి మరింత గొప్ప విజయాన్ని సాధిస్తామని, ఓడిపోయిన ఏకైక నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

బీహార్ రాష్ట్రంలో గెలుపు ఎన్డీఏ సొంతమని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంతో, ప్రజలతో బలమైన సంబంధాలున్నాయని అన్నారు. నేను తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాను, ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించాను. బీహార్ రాష్ట్రంలో ప్రత్యేకమైన అనుబంధం ఉందని మోదీ అన్నారు.

దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రానికి వెళ్ళాను.. బీజేపీ (ఎన్డీఏ) 400 సీట్లను గెలుపొందుతుందనే దృఢ విశ్వాసం నాకుందని అన్నారు. బీహార్ ఎన్డీఏకు మాత్రమే కాకుండా ఇండియా కూటమికి కూడా చాలా కీలకం. ఎందుకంటే రాష్ట్రం నుంచి 40 మంది ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్తారు.

బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ చీఫ్ నితీష్ కుమార్ మళ్లీ పార్టీ మారడం.. తిరిగి ఎన్డీయేలోకి వెళ్లడంతో ఈ ఏడాది ప్రారంభంలో ప్రతిపక్ష కూటమి కుదేలైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ 17 స్థానాల్లో పోటీ చేయగా, అవిభక్త లోక్ జనశక్తి పార్టీ ఆరింటిలో పోటీ చేసింది. బీజేపీ, ఎల్‌జేపీ తమ కోటాలో అన్ని స్థానాల్లో విజయం సాధించగా, నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ ఒక్క స్థానంలో ఓడిపోయింది. కిషన్‌గంజ్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ సారి ఈ నియోజక వర్గం కూడా ఎన్డీఏ కైవసం చేసుకుంటుందని మోదీ అన్నారు.

ఈ ఏడాది బీహార్ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఏర్పాటులో.. బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేయగా, జేడీయూ 16 స్థానాల నుంచి, చిరాగ్ పాశ్వాన్‌లోని లోక్ జనశక్తి పార్టీకి (రామ్ విలాస్) ఐదు సీట్లు, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాహ యొక్క రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక్కో స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

బీహార్‌లో ఇండియా కూటమి విషయానికి వస్తే.. అత్యధికంగా ఆర్‌జేడీ 26 స్థానాల నుంచి, కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, సీపీఐ(ఎంఎల్) 3, సీపీఐ, సీపీఎం ఒక్కొక్కటి చొప్పున పోటీ చేస్తున్నాయి. ఈ రోజు జరిగే ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.

Advertisement
Advertisement