
సాక్షి,హైదరాబాద్: తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారు. ఇదే అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వద్ద ప్రస్తావించిన నేతలు.. మీకు మేం ముఖ్యమో? కొండా ఫ్యామిలీ ముఖ్యమో? తేల్చుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇవాళా (జులై10) గాంధీ భవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనని క్రమశిక్షణా కమిటీకి తేల్చిచెప్పారు. ‘క్రమశిక్షణ కమిటి ముందుకు రావాలి అంటేనే అవమానంగా ఉంది. తిట్లు తిన్నది మేము.. కమిటి కూడా మమల్ని పిలిచింది అంటే ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కొండా మురళీపై చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే మాకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వండని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి తేల్చి చెప్పారు.మీకు మేము ముఖ్యమో..కొండా ఫ్యామిలీ ముఖ్యమో తేల్చాలంటూ అధిష్టానికి ఎమ్మెల్యేలు సూచించారు.
మరోవైపు,క్రమశిక్షణ కమిటీ సమావేశంపై మల్లు రవి మాట్లాడారు. వరంగల్ నేతల పంచాయితీపై చర్చిచాం. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలు చెప్పారు. వరంగల్ నేతలతో మరోసారి భేటీ అవుతామని అన్నారు.
వరంగల్ కాంగ్రెస్‌లో చిచ్చు రాజేసిన కొండా మురళి కామెంట్స్ వివాదం వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇప్పటికే తమను కించ పరుస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి.. వివాదంపై వివరణ ఇవ్వాలంటూ కొండా మురళికి నోటీసులు జారీ చేశారు.
దీంతో క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వాల్సిన కొండా మురళి ఊహించని విధంగా వ్యవహరించారు. గత నెలలో భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్‌కు నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమ య్యారు. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్‌రావులతో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు. ఆ లేఖలో పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఈ క్రమంలో.. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇవాళ వరంగల్ నేతలు క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.